పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 25వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో ఘనంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అవసరమైన రేకు చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేసింది. అదేవిధంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, అన్నప్రసాదాలు పంపీణి చేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై, దేవేరులను మరో పల్లకిపై అందంగా అలంకరించి కూర్చుండబెట్టి వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఉదయం సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని ఒక చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అదే విధంగా మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఇక్కడ దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు.
కాగా వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దకుమారుడైన శ్రీపెదతిరుమలాచార్యులవారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఏకారణాల వల్లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది. అయితే సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం నుండి తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు కార్తీక వనభోజనోత్సవం ఈ ఏడాది నవంబరు 25వ తేదిన పార్వేట మండపంలో మధ్యాహ్నం 1.00 నుండి 3.00 గంటల నడుమ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవంతుని సమక్షంలో భక్తులు కూడ సహపంక్తి భోజనం చేయడం విశేషం. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్ మరియు అన్నమాచార్యప్రాజెక్టు తరపున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.