విజయవాడలోని కృష్ణానదీ తీరంలో జరుగుతున్న ‘అమరావతి ఎయిర్‌షో-2018’ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ షోను తిలకించేవారితో నదీ తీరం కిక్కిరిసిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చూసి సందర్శకులు మైమరచిపోయారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కెప్టెన్ మెక్ జెఫ్రీన్ నేతృత్వంలోని విమానాలు గన్నవరం విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్నాయి. పవిత్ర సంగమం మీదుగా కృష్ణానది గగనతలంలో విన్యాసాలు చేశాయి. విమానాలు ఆకాశం నుంచి నేరుగా నదిలోకి దూసుకువస్తున్నట్టు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. 270 డిగ్రీల టర్న్‌తో చేసిన బ్యారెల్ రోల్, లూప్ ఇన్ స్వాన్ ఫార్మేషన్‌లు సందర్శకుల రోమాలు నిక్కబొడిచేలా చేశాయి.ఎయిర్‌షోతోపాటు నదిలో ఏర్పాటు చేసిన బోటు విన్యాసాలు కూడా ఆసాంతం ఆకట్టుకున్నాయి. వాటర్ ప్రెజర్, ట్యూబ్ పంపింగ్‌తో గాల్లోకి లేవడం చూసి సందర్శకులు తమను తాము కాసేపు మైమరచిపోయారు. ఆదివారం వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 11: 15 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 4:15 గంటల వరకు ఈ విమాన విన్యాసాలు ఉంటాయని అధికారులు తెలిపారు.వీకెండ్ కావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న అధికారులు పున్నమి ఘాట్ వద్ద మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ బోట్ రేసింగ్ సక్సెస్ జోష్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వం మరో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఆతిథ్యమివ్వడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.