విజయనగరం: గిరిజన ప్రాంతంలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి ప్రధాన నదులు.. జిల్లా సగ ప్రాంతానికి తాగు, సాగు నీరందిస్తున్నాయి.. జీవనదులను తలపించే ఈ నదులు ప్రస్తుతం జీవచ్ఛవంలా మారిపోతున్నాయి.. ఇందుకు కారణం ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా చేస్తున్న ఇసుక తవ్వకాలే. దొరికినకాడికి దొరికినట్లుగా తోడుకుపోతున్నారు. నిబంధనలు వద్దని చెబుతున్నా, అడిగేవాడు ఎవరన్నట్లుగా నదుల నుంచి ఇసుకను పిండేస్తున్నారు. ముఖ్యంగా పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది.పార్వతీపురం డివిజన్ పరిధిలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇసుక తీసుకోవాలని చెప్పినా అది ఎక్కడా అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. కొంతమంది అక్రమార్కులు తమ సొంత ట్రాక్టర్ల ద్వారా తీసుకుపోయి ఓచోట గుట్టలు గుట్టలుగా పోసి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్థావరాలే నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక తీసుకెళ్లాలని చెబుతున్నా ఎక్కడా అది అమలవుతున్న దాఖలాలు లేవు. ఇసుకను ట్రాక్టరులోనే తరలించాలనే నిబంధన ఉంది. ట్రాక్టరు తొట్టెలో నిండినంత పరిమాణంలో నింపితే మూడు యూనిట్లు పడుతుంది. అంతకు మించి తరలించకూడదు. కానీ అంతకంటే ఎక్కువే లోడు చేస్తున్నారు. తొట్టే నింపి, మళ్లీ దానిపైన ఇసుకను కొలిచినట్లు రవాణా చేస్తున్నారు. ఐదు యూనిట్ల వరకు రవాణా చేస్తున్నారు. పైనున్న ఇసుకను తమకు అనువైన చోట నిల్వ ఉంచి, మరొకరికి విక్రయిస్తున్నారు. ఇలా ఒకరోజు నాలుగైదు ట్రిప్పులు వేస్తే ఎనిమిది నుంచి పది యూనిట్ల ఇసుకను దాచివ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి.కొమరాడ మండలంలో దుగ్గి, కళ్లికోట, కూనేరు రామభద్రపురం, గుంప, కొట్టు, దేవునిగుంప, గరుగుబిల్లి మండలంలో నాగూరు, చిలకాం, శివ్వాం, జియ్యమ్మవలస మండలంలో బిత్తరపాడులో రేవులు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం ఇసుక తరలిస్తున్నారు. అయితే ఇసుకను రేవు నుంచి ఎంత తీసుకెళ్లినా అడ్డుకొనేవారు లేరు. పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లో ఇప్పుడు వద్దన్న వ్యాపారమే గొప్పగా సాగిపోతోంది. పార్వతీపురం మండలం మెట్టుపాక వెళ్లే దారిలో ఇసుకను పోసి.. ట్రాక్టర్లు నింపుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇది ప్రధాన స్థావరంగా మారిపోయింది. ఇసుక రేవులు పెద్ద సంఖ్యలో ఉన్న కొమరాడ మండలంలో కూడా ఇదే తరహాలో ఇసుక వ్యాపారం సాగుతోంది. రేవుల నుంచి తీసుకెళ్లే ఇసుక పర్యవేక్షణ గాలికి వదిలేయడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వాహన యజమానులు, ఇసుక వ్యాపారులు కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల నుంచి ఇసుక యథేచ్ఛగా సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం 3 యూనిట్లు తీసుకెళ్లకుండా అదనంగా రెండు నుంచి మూడు యూనిట్ల తీసుకెళుతున్నారు. మూడు యూనిట్లు రూ.1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. మిగిలిన రెండు యూనిట్లు నిల్వ ఉంచుతున్నారు. ఒక్కో రేవు నుంచి 50కి పైగా ట్రాక్టర్ల నుంచి ఇసుక వెళ్లిపోతోంది. ఇలా రోజుకు పై రేవుల నుంచి సుమారు 800 క్యూబిక్‌లకు పైగా అక్రమంగా తరలిపోతోంది.ఇసుకను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించిన ప్రభుత్వం రవాణా విషయంలో నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను మండలాల్లో ఏర్పాటు చేసింది. పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, జలవనరుల శాఖ, గృహనిర్మాణ సంస్థలకు చెందిన ఇంజినీర్ల బృందం ఇసుక రవాణాను నియంత్రించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.మండల స్థాయిలో తహసీల్దారు, ఎంపీడీవో, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు బృందంగా అక్రమ రవాణాను నియంత్రించాల్సి ఉంటుంది. ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పిన తొలినాళ్లలో అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు పోలీసు యంత్రాంగం సిబ్బందికి సూచనలు, ఆదేశాలిచ్చి ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇప్పుడు వాటివైపే ఎవరూ చూడడం లేదు.ఇసుక రేవుల్లో అక్రమాలను, ఇసుక రవాణాలో నిబంధనలు అమలుచేయని అంశాలను ఇసుకరేవు స్థాయి అధికారులు నియత్రించాలి. మూడు యూనిట్లకు బదులుగా, ఐదు యూనిట్లు రవాణా చేయడాన్ని వారు ప్రశ్నించాలి. స్థాయిని మించి ఇసుకను రవాణా చేసే వారిని గుర్తించి, వారి సమాచారాన్ని గనులశాఖ అధికారులకు ఇవ్వాలి. కానీ ఈ ఉద్యోగులు కేవలం గుమస్తా పనికే పరిమితమవుతున్నారు.