‘విను.. వినవయ్యా విను.. హే విను.. నువ్వు తెలివైన వాడివైతే నేనింకా తెలివైన వాడిని.. ఎస్పీకి చెప్పాను.. అతను చూసుకుంటాడంటూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనానికి గురైన సందర్భమిది. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలోని వెంకటపాలెంలో జల సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికొచ్చిన జీ కొండూరుకు చెందిన ఓ వ్యక్తి అమరావతిలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని పెద్దపెద్దగా కేకలు వేశాడు. అతనిని గమనించిన సీఎం అతనిని పిలిచి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబుకు, ఆ వ్యక్తికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తనపై కొందరు దాడి చేశారని ఆ వ్యక్తి సీఎంకు చెప్పాడు. ఘటనపై విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తానని, అడ్డదిడ్డంగా మాట్లాడొద్దని.. క్రమ శిక్షణగా ఉండాలని కేకలు వేస్తున్న ఆ వ్యక్తిని సీఎం వారించారు. రక్షణ ఉంది తమ్ముడు అని చంద్రబాబు అనగానే... లేదు సార్ అంటూ ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహానికి లోనైన చంద్రబాబు ‘విను.. వినవయ్యా విను.. హే విను.. నువ్వు తెలివైన వాడివైతే నేనింకా తెలివైన వాడిని.. ఎస్పీకి చెప్పాను.. అతను చూసుకుంటాడని’ కొంత అసహనానికి లోనయ్యారు. అయినా ఆ వ్యక్తి కేకలు వేయడంతో.. హే వింటావా లేదా నువ్వు.. పెద్దపెద్ద విషయాలు నీకు అవసరం లేదు.. నీ విషయం నువ్వు మాట్లాడు ముందు.. నోరుంది కదా అని పెద్దపెద్ద ఉపన్యాసాలివ్వడం కరెక్టు కాదు.. తగ్గించుకోవాలి’’ అని చెప్పిన చంద్రబాబు అక్కడ నుంచి వెళ్లిపోయారు.