ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మాత్రం ప్రభావాన్ని కోల్పోయింది. విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో రాష్ట్రాన్ని ఇచ్చిన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంలో ప్లాప్ అయిన ఆ పార్టీ.. అధికారాన్ని చేపట్టలేకపోయింది. ఇక ఆంధ్రాలో అయితే మరీ దారుణంగా ఉందా పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ చరిత్రలోనే ఒక రాష్ట్రంలో ఒక్క సీటు కూడా దక్కించుకోకుండా ఉండడం 2014 ఏపీ ఎన్నికల్లోనే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఏపీలో కోలుకోలేకపోయింది. ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అక్కడి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వీళ్ల చేరిక కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు సాధించి ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపడంతో పాటు, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపించాలంటే ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నదానిపై వర్క్ చేసిన ఆ పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని విభజించి ఏపీ ప్రజలను కష్టాల్లోకి నెట్టిన కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగానే ప్రకటించారు. దీనికి తోడు ఇప్పుడు తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికలపైనే ఫోకస్ పెట్టిన ఆ పార్టీ.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇదే ఏపీలోనూ కొనసాగే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీ నేతలు మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తుకు సంకేతాలు ఇస్తున్నాయి. ఏపీలోని కాంగ్రెస్ నేతలు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలనే టార్గెట్ చేస్తున్నారు. ఆయా పార్టీలు తెలుగుదేశం పార్టీపై పోరాటానికి దిగుతుంటే వీళ్లు మాత్రం జగన్, పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఏపీ నేతలు ఈ రెండు పార్టీలను, ఆ పార్టీల అధినేతలను టార్గెట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.