దినకరన్ వ్యూహం ఫలించేటట్లే కన్పిస్తోంది. తమిళనాడులో జరుగుగున్న ఉప ఎన్నికల నేపథ్యంలో చిన్నా, చితకా పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కమల్ హాసన్ దినకరన్ తో కలసి నడుస్తారన్న ప్రచారం జరుగుతుండటమే. అన్నాడీఎంకే బహిష్కరించడంతో దినకరన్ తమిళనాడులో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఉప ఎన్నికల్లో 18 స్థానాలు దినకరన్ వర్గానికి చెందిన వారివే కావడం గమనార్హం. వారంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్, దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, జీకే వాసన్ కు చెందిన టీఎంసీలు కలసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 18 నియోజకవర్గాల్లో దినకరన్ వర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలున్నారు. వారిని కాదని ఇతర పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఈ స్థానాలను తమకే వదిలేసి, ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కమల్ హాసన్ పార్టీకి, జీకే వాసన్ పార్టీలకు ఇవ్వాలన్న ఒప్పందం కూడా కుదరినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తమిళనాడులో మరో మినీసంగ్రామానికి తెరలేచినట్లే చెప్పొచ్చు. డీఎంకే, కాంగ్రెస్, వైగో పార్టీ తదితర పార్టీలు కలసి ఇప్పటికే మహాకూటమిగా ఏర్పడనున్నాయి. స్టాలిన్ ఇప్పటికే అదే పనిలో ఉన్నారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే బీజేపీతో కలసి పోటీ చేస్తుందా? లేదా? అన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. పళనిస్వామి, పన్నీర్ స్వామిల వ్యూహం ఇంకా తెలియరాలేదు. దీంతో అన్నాడీఎంకే, డీఎంకేలు ప్రధాన పోటీ దారులుగా ఉండబోతున్నాయన్నది వాస్తవం. అయితే దినకరన్ ఇరవై స్థానాల్లో ఎన్నికలు ఎదుర్కొనాలంటే తన బలం సరిపోదని గ్రహించారు. అన్నాడీఎంకే నుంచి క్యాడర్ పెద్ద సంఖ్యలో రాకపోయినా సభ్యత్వం మాత్రం భారీగానే చేసుకుని తన పార్టీకి క్యాడర్ ఉందని దినకరన్ చెప్పకనే చెప్పారు.అయితే కమల్ హాసన్ తొలుత కాంగ్రెస్ కు దగ్గరవుతూ కన్పించారు. కాని డీఎంకేతో పొసగని కమల్ ఆ కూటమిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. కమల్ హసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయన రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఇరవై స్థానాల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని కమల్ హాసన్ ప్రకటించడంతో లోక్ సభ ఎన్నికల నాటికి ఎన్నికల బరిలోకి దిగుతారని భావించిన మిగిలన పక్షాలు కొంత కంగుతిన్నట్లే కన్పించాయి. అయితే దినకరన్ పార్టీతో కలసి పనిచేయడానికి కమల్ హాసన్ అంగీకరించారన్న ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది.