YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అప్పుల్లో తెలంగాణ.. అప్పులబయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ తాజా నివేదిక

అప్పుల్లో తెలంగాణ.. అప్పులబయట ఆంధ్రప్రదేశ్         రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ తాజా నివేదిక
విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా భావిస్తున్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోతుండగా... తీవ్ర ఆర్థిక నష్టాలను దిగమింగుకుంటున్న ఆంధ్రప్రదేశ్ క్రమంగా అప్పులనుంచి బయటపడుతోంది. గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై అప్పు 22.2 శాతం పెరిగిందనీ... 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది 12.7 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు: ఆదాయ వ్యయాలపై అధ్యయనం’ పేరుతో... దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదిక వెలువరించింది. రుణమాఫీలతో పాటు ప్రయివేటు పెట్టుబడుల ప్రయోజనాలను దెబ్బతీసే మితిమీరిన అప్పుల కారణంగా పలు రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయని కేంద్రీయ బ్యాంకు అభిప్రాయం వ్యక్తం చేసింది.ఆర్బీఐ లెక్కప్రకారం జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి పెరగడమంటే ఆర్థిక నిర్వహణ అసమర్థంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ దారుణంగా ఉందంటూ తెలంగాణపై కాగ్ వెలువరించిన వార్షిక నివేదికను సైతం ఆర్బీఐ సమర్థించింది. తెలంగాణలో కేవలం ఒక్క ఏడాదిలోనే అభివృద్ధియేతర వ్యయం (పరిపాలనా పరమైన ఖర్చులు) ఇంతలా ఎలా పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో విస్మయం వ్యక్తం చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధియేతర వ్యయం 3.4 శాతంగా ఉండగా... ఈ సారి ఇది ఏకంగా 35.2 శాతానికి ఎగబాకడం గమనార్హం.మరోవైపు రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు 9.1 శాతం తగ్గాయని ఆర్బీఐ పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీపై 36.4 శాతం అప్పులుండగా... గత ఆర్థిక సంవత్సరంలో ఇది 27.3 శాతానికి దిగిరావడం విశేషం.కాగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఇటీవల తెలంగాణ అప్పులపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రూ.2.2 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆయన విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ... ‘‘కె. చంద్రశేఖర్‌రావు అప్పులు చేసి విపరీతంగా ఖర్చుపెట్టారు. ప్రస్తుతం ఆయన రూ. 2.20 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా మిగిల్చి వెళ్తున్నారు. అలాంటి అప్పుల్లో గనుక ఓ కంపెనీ ఉంటే అది దివాళతీయడం ఖాయం..’’ అని పేర్కొన్నారు.

Related Posts