కాంగ్రెస్ - టిడిపి అధినేతల ఆకస్మిక కలయికతో తెలుగు రాజకీయం రూటు మారింది. ఇప్పటికే తెలంగాణ లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరి..ఏపిలో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా లేదా అనే చర్చ సాగుతున్న సమయం లోనే..రెండు పార్టీల నేతల మధ్య ఓపెన్ గా కాకపోయినా..పరోక్షంగా సంకేతాలు ఇచ్చుకుంటున్నారు. ఏపిలో గతం కంటే తమ పరిస్థితి మెరుగైందని భావిస్తున్న కాంగ్రెస్ 45 స్థానాలు టిడిపి తో పొత్తులో భాగంగా కోరాలని భావిస్తోంది. అందులో టిడిపి ఎంత వరకు ఇస్తుందనేది చర్చల్లో పట్టుబట్టవచ్చనేది వారి అంచనా. ఇక, టిడిపి సైతం వ్యూహాత్మకంగా వ్యవహ రించి..ఏ నియోజకవర్గంలో ఏ రకమైన సమీకరణాల ఉన్నాయో..వాటిని దృష్టిలో పెట్టుకొని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే దీని పై తుది కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది...జాతీయ స్థాయిలో రెండు పార్టీల అధినేత కలయిక తరువాత.. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ పొత్తు కుదిరింది. సీట్ల పంపకం పూర్తయింది. రాహుల్- చంద్రబాబు కలిసి తెలంగాణ లో ప్రచారానికి కార్యాచరణ సిద్దం అవుతోంది. ఇక, ఏపిలో మాత్రం పొత్తు లేకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపి లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం..రాజకీయ అనివార్యతగా విశ్లేషకుల అంచనా. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం అంతర్గతంగా పొత్తు ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే..గతం కంటే ఏపిలో తమ పరిస్థితి మెరుగైందని..దీంతో..కనీసం 45 స్థానాలకు తమ పార్టీ నుండి అవకాశం ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గాల ను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభించింది. 45 స్థానాలకు లిస్టు ఇస్తే..కనీసం సగం అయినా తమకు సీట్లు దక్కుతాయనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ముందుగానే క్లారిటీ తీసుకోవటం ద్వారా..ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఇక, ఎంపీ సీట్ల విషయంలో మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఎంపీ స్థానాల వ్యవహారం పూర్తిగా ఏఐసిపి పరిధిలోని అంశం కావటంతో దీని పై పిసిసి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు.ఏపిని విభజించిన కాంగ్రెస్ పై ఏపి ప్రజలు గత ఎన్నికల్లో ఊహించని తీర్పు ఇచ్చారు. ఇప్పటికీ టిడిపి - కాంగ్రెస్ తో పొత్తు వ్యవహారం పై ప్రజా నాడి ఎలా ఉంటుందో అనే ఆందోళన ఇప్పటికీ టిడిపి నేతల్లో ఉంది. ఏపికి బిజెపి అన్యాయం చేసిందని..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ తో 40 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి..వారితో కలిసేందుకు ముందుకు వచ్చామని టిడిపి అధినేత పలు మార్లు చెప్పకొచ్చారు. తెలంగాణలోని సెటిలర్లు...ఏపిలోని ఓటర్లకు ఇదే విషయాన్ని మరింత స్పష్టత ఇచ్చేందుకు సోనియా గాంధీ తన హైదరాబాద్ సభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని సభలో స్పష్టమైన ప్రకటన చేసారు. ఇప్పుడు సోనియా గాంధీ ప్రకటన ద్వారా టిడిపి నేతలకు తమ నిర్ణయాన్ని సమర్ధించుకొనే అవకాశం తో పాటుగా...ప్రజల్లోకి వెళ్లటానికి కాంగ్రెస్ నేతలకు అవకాశం ఏర్పడింది. వైసిపి ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా టిడిపి పై విమర్శిస్తున్న నేపథ్యంలో...దీని పై కౌంటర్ చేయటానికి..పొత్తు ఏర్పాటుకు ఇప్పుడు ఇదే ప్రధాన అంశంగా మారుతోంది.ఏపిలో పొత్తు అనివార్యమనే సంకేతాలు కనిపిస్తున్నా...కాంగ్రెస్ - టిడిపి పొత్తు పై డిసెంబర్ 11న వెల్లడయ్యే తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాతనే స్పష్టత వచ్చే రానుంది. రెండు పార్టీలు కలిసి తెలంగాణలో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఓటరు నాడిని పూర్తిగా అంచనా వేసిన తరువాత ఏపి లో పొత్తు పై తుది నిర్ణయం ఉంటుందని ఏపి టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. అక్కడి ఓటర్లు..ప్రధానంగా సెటిలర్ల ఓటింగ్ ప్రభావం ఆధారంగా ఏపిలో పొత్తు పై సమాలోచనలు ఉంటాయని వారు చెబుతున్నారు. ఇక, దేశ వ్యాప్తంగా జరుతున్న పరిణామాలతో బిజెపి పై వ్యతిరేకత పెరుగుతోందని .. ఏపిలో వైసిపి-బిజెపి మధ్య ఉన్న సంబంధాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి..వైసిపి అండగా నిలుస్తున్న మైనార్టీ - ఎస్సీ ఓట్ బ్యాంకు చీల్చాలంటే కాంగ్రెస్ తో పొత్తు అవసరమనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. దీంతో..వ్యూహా త్మకంగా కాంగ్రెస్ -టిడిపి అధినేతలు అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ 11 ఫలితాల ఆధారంగా ఏపిలో పొత్తు కుదుర్చుకోవటానికి వీలుగా ముందస్తు ప్రణాళికలు వేగంగా అమలవుతున్నాయి. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆధారంగానే తుది నిర్ణయం అనేది సుస్పష్టం.