YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నేడు మహాశివరాత్రి

నేడు మహాశివరాత్రి

- ఓమ్ నమః శివాయ

మన పండగలన్ని తిధులతోను,నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి.కొన్ని పండగలకు తిధులు,మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణ పక్షమిలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్ధశి తిధిని మాస శివరాత్రి అంటారు.ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివున్ని కొలుస్తారు.సూర్యాస్తమ సమయమునకు పరమందు 6 ఘడియలను ప్రదోషకాలమంటారు..

మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహాశివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్రగ్రంధాలు తెలుపుతున్నాయి.అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.
ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శంకరుని అనుగ్రహం లభిస్తుంది. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి.


హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసము బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. వీటిలో మాఘ మాసములో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి కాలమున పరమశివుడు లింగరూపమున ఆవిర్భవించాడు. కనుక అర్ధరాత్రి సమయానికి చతుర్దశి ఉన్ననాడే మహా శివరాత్రి. మహా శివము గల రాత్రి కనుక అది మహా శివరాత్రి అయ్యింది.

మహాశివరాత్రి రోజున ప్రధానంగా మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం.

శివుడు అభిషేక ప్రియుడు. అందువలన శివునిపై మనసు లగ్నం చేసి అభిషేకం చేసినందువలన ఆ భక్త సులభుడు తేలికగా అనుగ్రహిస్తాడు. ఈ అభిషేక ద్రవ్యాలలో ఒక్కొక్క ద్రవ్యంతో చేసే అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మన కోరికను బట్టి దానికి తగిన అభిషేక ద్రవ్యాన్ని ఎంచుకోవచ్చు. ఏ కోరికా లేకుండా చేసే అభిషేకానికి వట్టి గంగా జలమే చాలు.

ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. “ఉప-సమీపే”- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. అసలు ఆహారము అంటే మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియములతో స్వీకరించబడునది అని అర్థము.

ఈ రాత్రి మధ్యకాలానికి ‘తురీయ సంధ్య’ అని పేరు. 
శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది

జన్మానికో శివరాత్రి అని పెద్దలు అంటుంటారు. అంటే జన్మలో ఒక్క శివరాత్రినాడైనా పైన చెప్పినవన్నీ పాటిస్తూ, శివుడిని ప్రసన్నం చేసుకోగలిగితే ఇక మరుజన్మ ఉండనే ఉండదు.

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు

Related Posts