‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ అంటూ గొంతు సవరించి సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్న మట్టిలో మాణిక్యం, పల్లెకోకిల బేబీకి మెగాస్టార్ ప్రశంసలు దక్కాయి. ఆమె పాటకు ఫిదా అయినా మెగాస్టార్ తన సతీమణి కోరిక మేరకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి సహకారంతో బేబీని ఇంటికి పలిపించుకుని అభినందించారు. ఆమె పాటను విని సతీసమేతంగా పరవశించుపోయారు మెగాస్టార్. తన అభిమాన నటుడి పిలుపు అందుకుని ఇంటికి వెళ్లిన బేబీ చిరంజీవిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. మెగాస్టార్‌ని చూసి ఇక చనిపోయినా పర్లేదు మిమ్మిల్ని చూశా అని చిరు కాళ్లపై పడింది. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్లు ఈ పరిశ్రమలో ఉండాలి. ఈ పరిశ్రమను బ్రతికించాలి అంటూ ఆమెతో పాటలు పాడించుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ భార్య సురేఖ సైతం తన ఆనందాన్ని పంచుకున్నారు. బేబీ పాటను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. మీ టాలెంటే మిమ్మిల్ని ఇక్కడకు రప్పించిందని అన్నారు. మెగాస్టార్ నటించిన ‘రుద్రవీణ’ మూవీ నుండి ‘లలిత ప్రియ గమనం’ అంటూ బేబీ పాడిన పాటకు మెగాస్టార్ పరవశించి పోయారు. ఈ పాటను ఎంచుకోవడం ద్వారా మీ అభిరుచి ఏంటో అర్ధమౌతోంది అన్నారు చిరు. మీకు మంచి భవిష్యత్ ఉందని.. మీ టాలెంట్‌ను ఇండస్ట్రీ తప్పకు ఉపయోగించుకుందని భరోసా ఇచ్చారు చిరంజీవి. పాటను ఎవరైనా పాడతారు. కాని సప్త స్వరాలను పలికిస్తూ వీనుల విందు చేయడం కొందరికే సాధ్యం. అందులోనూ అక్షరం ముక్కైనా రాని ఓ పల్లెటూరి నిరుపేద మహిళ అక్షరం పొల్లుపోకుండా పదనిసలు పలికించడమే అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదే బేబీ ప్రత్యేకత. సంగీతం అంటే తెలియదు. స్వరాలపై కనీస అవగాహనే లేదు. రాగం, తానం, పల్లవి, శృతి, లయలంటే అవగాహనే లేదు. ఇవన్నీ ఎందుకు కనీసం ఆమెకు అక్షరం ముక్కైనా రాదు. కాని ఆమె పాటతో కొన్ని కోట్ల మంది సంగీత ప్రియుల హృదయాలను మీటింది. తూర్పుగోదావరి జిల్లా వడిసలేరు గ్రామానికి చెందిన బేబి సోషల్ మీడియా పుణ్యాన గాగ కోకిలగా మారింది. నిరుపేద అయిన బేబీ వ్యవసాయ కూలీ. తన తోటి కూలీలతో కలిసి పంట పొలాల్లో పాటలు పాడే బేబీ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఆమె పాడిన ప్రేమికుడు చిత్రంలోని ‘ఓ చెలియా నా ప్రియసఖియా’తో పాటు మిగిలిన పాటలు ఇప్పుడు సంగీత సంచలనంగా మారాయి. చిన్నప్పటి నుండి పాటలు పాడటం అలవాటు చేసుకున్న బేబీ పాటంటే ఆ ఊరి జనానికి వీనుల విందు. అందుకే ఆమెను అడిగి మరీ పాటలు పాడించుకుంటారు ఈ ఊరి జనం. అలా ‘ఓ చెలియా నా ప్రియసఖియా’ అనే పాటను పాడుతుండగా.. తనతో పాటు కూలీ పని చేసే ఎదురింటి రాణి ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేసింది. దీంతో ఆమె పాట కోట్ల మంది హృదయాలను కదిలించింది. ఆ పేద కూలీని ఒక్కసారిగా గాన కోకిలగా మార్చింది. శ్రావ్యమైన గొంతుతో.. అక్షరం ముక్కైనా బేబీ అక్షరం పొల్లుపోకుండా పాట పాడుతుంటే ఆమె గానామృతాన్ని ఆస్వాదించకుండా ఉండలేరంటే అతిశయోక్తికాదు. ‘నా ఆర్ధిక పరిస్థితులు వల్ల చదువు కోలేకపోయా.. కాని పాట విన్నానంటే అది మైండ్‌లో ఫిక్స్ అయిపోద్ది. టీవీలలో ఏదైనా పాట చూసి.. అది నేను పాడగలను అని అనిపిస్తే.. ఆ పాటను నేర్చుకోకుండా నిద్రపోనంటుంది బేబీ’.ప్రస్తుతం బేబీ పాట స్వరరాగ గంగా ప్రవాహంలా మారి.. సంగీత దర్శకులు, ప్రముఖ సింగర్స్ చెవిన పడటంతో బేబీతో పాటలు పాడించేందుకు ముందుకు వస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఆల్ ది బెస్ట్ బేబీ.