డబ్బులు ఇస్తే ఎసై ఉద్యోగం నేరుగా వచ్చేస్తుందా అని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో తణుకు పట్టణానికి చెందిన కాలాడత్తుల నాగేశ్వరరావు అనే వ్యక్తి తనకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన సాకా భాస్కర్ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా మెసం చేసాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. ఈ విషయం లో కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయలకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటే ఎలా నమ్మవు అని నేరుగా లంచాలతోను రికమండేషన్ తోను ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వస్తాయని అనుకున్నావని కలెక్టర్ ప్రశ్నించారు. నిరుద్యోగ యువత మాయమాటలు చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మవద్దని హితవు పలికారు. ఈ విషయమై ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని లంచం తీసుకున్న వ్యక్తి పై ,లంచం ఇచ్చిన వ్యక్తి పై సాయత్రంలోగా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్.కాపి తనకు అందజేయాలని పోలిస్ అధికారులను ఆదేశించారు. యువత వారి సామర్ధ్యం, పోటీ పరీక్షలు, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు కృషి చెయ్యాలే కాని సొమ్ములు చెల్లించి అడ్డదారిలో ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. పెదవేగి మండలం కూచింపూడి గ్రామానికి చెందిన జి. రామారావు, పి.పోతురాజు, మరికొంత మంది కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ గ్రామంలో వున్న శేషమ్మ చెరువును కొంతమంది ఆక్రమించుకొని మొక్కజొన్న చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికి పట్టించుకోవడంలేదని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు తక్షణం స్పందించాలని తాను పదే పదే చెబుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇది ఎంత మాత్రం సహించబోనని అన్నారు. వచ్చే గురువారం తాను స్వయంగా వచ్చి చూస్తానని ఈ లోగా ఆక్రమణలను తొలగించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొంటానని అవసరమైతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
పెదవేగి మండలం కొప్పాక రెవిన్యూ పరిధిలోని పెదకమిడి గ్రామానికి చెందిన చెలసాని వెంకటరావు, పి. నాగేశ్వరరావు మరికొంత మంది కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ గ్రామంలో మొక్కజొన్న పండించని రైతులకు కూడా అధికారులు మొక్కజొన్న పంట సాగుచేస్తున్నట్లు చూపించి ప్రభుత్వ సొమ్మును అందజేసారని చెప్పారు. గ్రమంలో సుమారు ఒక కోటి 40 లక్షల రూపాయలు 1787 ఎకరాలకు అందించారని,వాస్తవంగా అన్ని ఎకరాలు మొక్కజొన్నసాగు గ్రామంలో ఎవరూ చేయలేదని ఇతర పంటలు పండించిన రైతులకు కూడా అధికారులు సొమ్ములు చెల్లించినట్లు చెప్పారు. దీని పై కలెక్టర్ స్పందిస్తూ స్వయంగా పరిశీలించడమే కాకుండా గ్రామంలో టాంటాంవేసి గ్రామస్తులను విచారణ చేసి వాస్తవంగా మొక్కజొన్న పంట పండించిన రైతుల వివరాలు వారికి చెల్లించిన సొమ్ముల పూర్తి వివరాలను వారం రోజుల్లో గా నివేదిక రూపంలో తనకు అందజేయాలని వ్యవసాయశాఖ జెడి గౌషియా బేగంను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యం,వేణుగోపాల్ రెడ్డి, ఎన్, సత్యనారాయణ, డి.ఇ.ఓ రేణుక, కె. సుభాషిణి, డాక్టర్ సుబ్రహ్మణ్శేశ్వరి, డాక్టర్ శంకర్ రావు, సూర్యరావు, పిడి ఎమ్ వెంకటరమణ, పిడి శ్రీనివాసులు, విజయలక్ష్మి రంగలక్ష్మిదేవి, నిర్మల,ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.