కొల్లేరు వ్యవహారం మళ్లి మొదటికొస్తోంది. చేపల సాగులో బడాబాబులు చేరుతున్నారు. అక్రమ చెరువులు, భారీ కట్టల నిర్మాణాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. వరద ప్రవాహం తగ్గిన తరవాత గట్లు బయట పడ్డాయి. దీంతో గ్రామాల్లో వేలం పాటల సందడి మొదలయ్యింది. కొల్లేరు భూములను చేపల సాగుకు ఆయా గ్రామాల పరిధిలోని పెద్దలు వేలం నిర్వహిస్తుంటారు. వీటిలో జీరోపాయింట్ల సాగు, అడుగు పట్టుబడులకు నిర్వహించే పాటలు కైకలూరు, మండవల్లి మండలాల్లో రూ.కోట్లను దాటిపోతాయి. తక్కువ లీజు పాటలు కావడంతో గుడివాడ, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి ప్రాంతాల నుంచి బడాబాబులు కొల్లేరులోకి ప్రవేశిస్తున్నారు. కైకలూరు, మండవల్లి మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. దీంతో రూ.వేలకోట్లు వెచ్చించి నిర్వహించిన కొల్లేరు ఆపరేషన్ అపహాస్యం పాలవుతోంది. పూర్వపుస్థితికి సరస్సు వచ్చేస్తోంది. ఆక్రమణ గట్ల వల్ల ఎగువ ప్రాంతాలకు ముప్పు తప్పేలా లేదు. పర్యావరణ పరిరక్షణ గాలిలో దీపంగా మారనుంది.
> కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని ఏడు మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 2006లో అప్పటి ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ నిర్వహించి చేపల చెరువుల్ని కొట్టేసింది. ఐదో కాంటూరు పరిధిలో 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఐదో కాంటూరులోపల ఎటువంటి అక్రమ సాగు చేపట్టకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో పరిరక్షణ చర్యలు చేపట్టింది. అక్రమ చెరువుల నిర్మాణం, పక్షుల వేటలపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయాల్సి ఉంది. అటవీశాఖ సిబ్బంది నిఘా ఉన్నప్పటికీ ఆక్రమణల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. గ్రామాల పరిధిలోని చెరువులను ఆయా గ్రామస్థులే ఆక్రమించి చేపలు, రొయ్యల సాగు చేసి రూ.వేలకోట్ల ఆదాయం పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబులు కూడా కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అక్కడి ప్రజలకు మద్దతుగా ఉన్నారు. బయటి నుంచి వ్యక్తులు వచ్చి సాగుచేస్తే సహించేది లేదని వారు ఇప్పటికి అనేకసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లోని పెద్దలు పట్టించుకోకుండా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం భూముల పంపిణీపై చర్యలు తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో ఆక్రమణల విషయం బయటకు వస్తే అసలుకే మోసం వస్తుందని కామినేని కొల్లేరు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు.
కొల్లేరు ఆపరేషన్ అనంతరం రెండేళ్ల కిందటి వరకు ఈ ప్రాంత భూముల్లో స్థానిక పేదలే జీరో పాయింట్లు సాగు చేసుకుని ఆదాయం పొందుతుండేవారు. రెండేళ్లుగా వేలం పాటల్లో బయటి వ్యక్తులు చొరబడుతున్నారు. మండవల్లి మండలంలోని కొల్లేరు లంక గ్రామాల్లో ఇప్పటికే వేలం పాటలు పూర్తయ్యాయి. కైకలూరు మండలం లక్ష్మీపురంలో సుమారు 250 ఎకరాలను రూ.38 లక్షలకు, గుమ్మళ్లపాడులో 500 ఎకరాలను రూ.1.50 కోట్లు, గోకర్ణపురంలో 260 ఎకరాలు రూ.60 లక్షలు, పందిరిపల్లిగూడెం పరిధిలోని 560 ఎకరాలను రూ.2 కోట్లు, వడ్లకూటితిప్ప గ్రామంలో 170 ఎకరాలను 28 లక్షలకు వేలం పాటలు నిర్వహించారు. గత ఏడాది కొన్ని గ్రామాల్లో మూడేళ్ల కౌలు కాలపరిమితికి వేలం నిర్వహించారు. వడ్డిల సొసైటీ చెరువు 50 ఎకరాలను రూ.18 లక్షలకు, ఎస్సీల సొసైటీ 150 ఎకరాలు ఏలూరుకు చెందిన వ్యక్తి రూ.9 లక్షలకు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీళ్లంతా రాత్రికి రాత్రే గట్టు ఎత్తును పెంచేస్తున్నారు. దీనికోసం గ్రామ సర్పంచికి, అటవీశాఖ అధికారులకు ముడుపులు ముట్టజెపుతున్నారు. శృంగవరప్పాడు, గోకర్ణపురం, లక్ష్మీపురం గ్రామాల పరిధిలో కూడా గుడివాడ, విజయవాడ ప్రాంతాలకు చెందిన బడాబాబులు రంగంలోకి దిగారు. మండవల్లి మండలంలోని నందిగామ లంకలోని 600 ఎకరాలు, పులపర్రులోని వెయ్యి ఎకరాల్లో ఏలూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన బడా వ్యాపారులు ఆక్రమ సాగు చేస్తున్నారు.
> కొల్లేరు గ్రామాల్లో పెద్దల కమిటీలు రాజ్యం ఏలుతున్నాయి. గ్రామానికి 10 నుంచి 15 మంది గ్రామ పెద్దలను ప్రతి రెండేళ్లకు ఎన్నుకుంటారు. వీరి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పరిధిలోని కొల్లేరు భూములను వేలం నిర్వహిస్తుంటారు. వచ్చిన ఆదాయాన్ని గ్రామ అవసరాలకు ఉపయోగించాల్సి ఉంది. కైకలూరు మండలంలోని ఓ చిన్న కొల్లేరు గ్రామానికి ఏడాదికి ఇలా కొల్లేరు భూములపై వచ్చే ఆదాయం సుమారు రూ.5 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ ఆదాయాన్ని గ్రామంలో జాతరలు, శ్రీరామనవమి, ఇతర పండగలకు ఖర్చు చేస్తుంటారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి ఇంత అని పంచుతారు. తాజాగా పెద్దలు ఈ ఆదాయాన్ని భారీగా పక్కదారి పట్టిస్తున్నారు. రాజకీయ పార్టీల సమావేశాలు, కొల్లేరు సమస్యపై పోరాటానికి కైకలూరు, విజయవాడ, దిల్లీలకు తిరిగినందుకు ఖర్చులంటూ లెక్కలు రాస్తున్నారు. చివరికి అప్పులు చూపిస్తున్నారు. గ్రామపెద్దలకు ఎదురు తిరిగి అవకాశం ఉండదు. అలా చేస్తే గ్రామం నుంచి వెలివేస్తారు. దీనిపై అడిగేవారు లేరు. ఇలా కొల్లేరు భూములపై వచ్చే ఆదాయాన్ని పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు.