మహబూబ్ నగర్: జిల్లాలో ఇటీవల నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. వర్షాలు లేకపోవడంతో ఈసారి పెద్దగా కేసులు నమోదు కావని అధికారులు అనుకున్నారు. కాని చల్లదనం ఎక్కువగా ఉండటం.. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కర్నూలు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ బాధితులు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు పనుల నిమిత్తం, విహార యాత్రలకు, దైవ దర్శనాలకు వెళ్తున్న వారు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎక్కువ మంది ఒకేచోట ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ప్రస్తుతం కురుమూర్తి జాతర ప్రారంభమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు జాతరకు వచ్చిన భక్తులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.
> స్వైన్ ఫ్లూను ముందుగా గుర్తిస్తే అవసరమైన వైద్యం చేయించుకొని నయం చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఎన్నికల విధుల్లో ఉన్న జిల్లా అధికార యంత్రాంగంలో కొందరు స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. అయితే వారికి సకాలంలో గుర్తించి అవసరమైన వైద్య సేవలను అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుటపడి ప్రస్తుతం చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. సకాలంలో గుర్తించకుండా ఆలస్యంగా గుర్తించిన వారు ఎక్కువ అనారోగ్యం బారిన మృతి చెందుతున్నారు. ఈ విషయాలను ప్రజల్లో విస్తృతంగా అధికారులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలు ప్రారంభం కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కేసులు నమోదైన ప్రాంతాల్లో వారికి తెలిసినవారు.. చుట్టుపక్కల వారికి ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కర్నూల్, హైదరాబాద్‌లలో కేసుల నమోదు అధికంగా ఉండటంతో పనుల నిమిత్తం వెళ్లి వస్తున్న వారికి వైరస్ సోకే ప్రమాదం ఉందని, ఏవైనా స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో సైతం అనుమానితులు, బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. నమూనాలు సేకరించేందుకు అవసరమైన కిట్‌లతోపాటు ఎన్-95 మాస్క్‌లను అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
> జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా చలికాలంలో స్వైన్‌ఫ్లూ ఆందోళన కలిగిస్తుంది. ఇన్‌ఫ్లుయోంజా వైరస్‌గా దీనిని పిలుస్తారు. సాధారణంగా పందుల్లో ఫ్లూ జ్వరాన్ని తెచ్చిపెట్టే ఎ రకం(హెచ్1ఎన్1) వైరస్ ఇది. చల్లని వాతావరణంలో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి ఉంటుంది. ఒకరి నుంచి ఒకొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం చల్లటి వాతావరణం.. వర్షాలు లేకపోయినా వస్తుండటంతో అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.