భారత్ లో ఎన్నికలు వస్తే ప్రలోభాల పర్వం మొదలైపోతుంది. ఓట్ల కోసం పలువురు నేతలు అడ్డదారులనే ఆశ్రయిస్తుండడం చాలాకాలంగా సాగుతోంది. ఓటర్లకు ధనం, మద్యం, ఇతరత్రా కానుకలు ఎరవేస్తూ తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో రాజకీయ నేపథ్యం ఉన్నవారే కాక వ్యాపారవేత్తలూ ఉంటున్నారు. ఇదీ ఎలక్షన్ టైమ్ లో ధన ప్రవాహానికి ప్రధాన కారణంగా ఉంటోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రాబల్యం నిలుపుకునేందుకు, వారసులను గెలిపించుకునేందుకు కొందరు ఇదో ఈజీ రూట్ గా భావిస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్ధి ఎవరైనా వారిని గెలిపించుకునేందుకు పార్టీలు కూడా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి. రాజకీయాల్లో మనుగడ, స్థిరత్వం కోసమే పార్టీలు ఎన్నికల్లో ఖర్చుపై రాజీ పడడంలేదు. కోట్లు గుమ్మరించి తమ క్యాండిడేట్ ను గెలిపించుకోడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక జనాభాలో అధికభాగం ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవడంలేదు. ఎలక్షన్ టైమ్ లో ఇదంతా సాధారణమే కదా అన్న భావన వారిలో నెలకొంది. దేశంలో ప్రభుత్వ-అధికార యంత్రాంగం పరిధిలో పెరిగిపోయిన అవినీతే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు.