YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

సీజే తీరు బాగోలేదు.. జరగకూడనివి జరిగాయి

సీజే తీరు బాగోలేదు.. జరగకూడనివి జరిగాయి

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ న్యాయ చరిత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై మిగతా సీనియర్‌ న్యాయమూర్తులు బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఊహించని విధంగా మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ తన నివాసంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు (జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌)తో కలిసి జరిగిన పరిణామాలను మీడియా ముందు వివరించారు. అయితే పూర్తి అంశాలను వెల్లడించకుండా మీడియాకు లేఖలు విడుదల చేశారు.


జస్టిస్‌ చలమేశ్వర్‌ ఏం చెప్పారంటే...‘‘దేశంలోనే కాదు.. ప్రపంచ న్యాయ చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా పరిపాలన విధానం సరిగా లేదు. జరగకూడని పరిణమాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వస్తున్నట్లు ఇవేం రాజకీయ అంశాలు కావు. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తికి(లేఖ ద్వారా) విజ్ఞప్తి చేశాం. కానీ, ఆయన నుంచి సానుకూల స్పందన లభించలేదు. అందుకే లోపాలను సరిదిద్దాలని మేం నలుగురం భావించాం. న్యాయవ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే వాటిని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చాం. చీఫ్‌ జస్టిస్‌ ను అభిశంసించాలా లేదా అన్నది దేశ ప్రజలే తేల్చుకోవాలి' అని ఆయన చెప్పారు.

కాగా ఇంతకు ఏ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విభేదాలు వచ్చాయి? ఏ అంశాన్ని ఆయన నిరాకరించారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. అన్ని వివరాలను లేఖ రూపంలో ఇస్తామని తొలుత చెప్పి అనంతరం వాటిని మీడియాకు అందజేశారు. తమ ముందు మరో అవకాశం లేకుండా పోవటంతోనే ప్రజల ముందుకు వచ్చామని మరో న్యాయమూర్తి లోకూర్‌ తెలిపారు. ఇక గత డిసెంబర్‌ లో ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా-జస్టిస్‌ చలమేశ్వర్‌ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకపక్షంగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నిర్ణయాలు తీసుకుంటున్నారని జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.

వరుస భేటీలు.. 

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానితో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ భేటీ అయ్యారు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు విమర్శల నేపథ్యంలో అటార్నీ జనరల్‌తో ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా భేటీ కావటం విశేషం.

Related Posts