దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.....ఓ బస్సును తగలబెట్టారు. హింసను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
లా చదువుతున్న 26 ఏళ్ల దిలీప్ శుక్రవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలోనే లగ్జరి కారులో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులకు దిలీప్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతే...వారు దిలీప్‌ను రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్‌తో చితకబాదారు.
తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం కన్నుమూశాడు. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ప్రధాన ఆరోపితుడు రైల్వే ఉద్యోగి విజయ్ శంకర్ సింగ్ పరారీలో ఉన్నాడు. విజయ్ శంకర్‌సింగ్ డ్రైవర్‌తో దిలీప్‌పై హాకీ స్టిక్‌తో దాడి చేసిన రెస్టారెంట్ వెయిటర్ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు నమోదైంది.
దళిత విద్యార్థి హత్యపై బిఎస్‌పి చీఫ్ మాయావతి దుఃఖాన్ని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత విద్యార్థి హత్యను సిపిఎం ఖండించింది. దిలీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. యూపిలో యోగి సర్కార్ పగ్గాలు చేపట్టాక మతతత్వ శక్తుల మనోబలం మరింత పెరిగిందని...భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.