YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

11వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

11వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
మున్సిపాలిటీలో జీఓ 279 అమలు చేయకూడదని డిమాండ్ చేస్తూ పది రోజులుగా కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ సంబంధిత జీవో అమలు చేయడం లేదని, కేవలం ఒక్క హిందూపురం మున్సిపాలిటీలోనే అమలు చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. ఈ జీఓ అమలు చేయడం వల్ల అటు కార్మికులతో ఇటు ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో 110 నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు ఉండగా దాదాపు 50 మున్సిపాలిటీల్లో మాత్రమే అరకొరగా అమలవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే స్థానిక మున్సిపాలిటీలో జీవోనెంబర్ 279 అమలు చేస్తుండగా తమిళనాడుకు చెందిన గుత్తేదారు ఈ కాంట్రాక్టును తగ్గించుకున్నారు. సంబంధిత గుత్తేదారు కింద ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులే పనులు చేస్తూ మూడు, నాలుగు నెలల వేతనాలు కూడా అందుకున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ (ఆర్‌టీఎంఎస్)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌టీఎంఎస్ అమలు చేయడం వల్ల సేవలు సులభతరం కావడంతోపాటు ఎక్కడ చెత్త ఉంది, ఏ సమయంలో ఆ చెత్తను తొలగించారు, చెత్త సేకరణ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయన్న విషయాలను తెలుసుకొనేందుకు ఈ విధానం ఎంతో దోహద పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే గత పది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియచేశాయి. ఇటీవలే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈనెల 27వ తేదీన చలో హిందూపురం కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇకపోతే పది రోజులుగా చెత్తాచెదారం తొలగించకపోవడం, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని సోమవారం నుండి తాత్కాలిక కార్మికులను విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు చేయించాలని భావించింది. అయితే కొందరు కార్మిక సంఘాల నాయకులు అధికారులతో చర్చించి సమ్మె విరమణకు తమకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. కార్మికులు సమ్మె విరమిస్తారా లేక అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని పారిశుద్ధ్యం మెరుగు చేపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

Related Posts