ఏళ్లతరబడి అటవీశాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో స్మగ్లింగ్ నివారణోపాయాలకు బ్రేక్ పడుతోంది. ఫలితంగా అటవీసంపద రక్షించాల్సిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది చాలామంది అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో వనసంపద అక్రమమార్గాన దారిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా మూడు అటవీడివిజన్లు ఉండగా, కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్లలో దాదాపు 100కుపైగా కీలకస్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు రేంజర్ పోస్టులు, 3డిప్యూటీ రేంజర్ పోస్టులు, 4సెక్షన్ ఆఫీస్ పోస్టులు, 4బీట్ ఆఫీసర్లు, 246 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల ఖాళీలు ఉన్నాయి. అలాగే 90మంది ప్రొటక్షన్ వాచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్ డీఎఫ్‌వో ఒక పోస్టు ఖాళీగా ఉంది. బీట్ ఆఫీసర్లు 11, అసిస్టెంట్ వర్కర్లు 2, జూనియర్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 1, సూపరింటెండెంట్ స్థాయి పోస్టులు 23వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని గతనెలలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అటవీశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నియామకాలు త్వరగా జరిగితే వీలైనంత సంపదను స్మగ్లర్ల నుండి రక్షించుకోవచ్చునని జిల్లాస్థాయి అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమిళకూలీల పాలిట జిల్లాలో ఉన్న ఎర్రచందనం వృక్షాలు నేలకొరుగుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు అటవీశాఖ అక్రమ స్మగ్లర్ల పాలిట పిడికిలి బిగించి ముందుకెళ్లేందుకు ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా జిల్లాకు రాష్ట్రప్రభుత్వం 40తుపాకులు డివిజనల్ స్థాయి అధికారులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 40తుపాకులు జిల్లాకు చేరనున్నాయి. అక్రమస్మగ్లర్లు అటవీసంపదను దోచుకోవడంలో ఇష్టారాజ్యంగా ఎర్రచందనం వృక్షాలు నరికివేస్తూ తమిళనాడు రాష్ట్రం నుండి సముద్రమార్గం గుండా ఇతరదేశాలకు ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. చైనా, అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా దేశాలకు ఈ దుంగలు స్మగ్లర్లు తరలిస్తూ భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. వీరి నుండి అటవీసంపద రక్షించడంలో అటవీశాఖ అధికారులు ఎంతప్రయత్నం చేసినా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. జిల్లాలో అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల దాడి రోజురోజుకు పెరిగిపోతోంది. వీరిని కట్టడి చేసేందుకు క్షేత్రస్థాయిలో సరిపడినంత సిబ్బంది లేకపోవడంతోపాటు అటవీశాఖ అధికారుల వద్ద వృక్షాలను నరికే కూలీలను పట్టుకోవడంలో విఫలవౌతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మూడునెలల కిందట ప్రభుత్వం రూ.2.70కోట్లు నిధులు వెచ్చించి 200 ఆయుధాలను అటవీశాఖ కొనుగోలుచేసింది. అధికారులు, సిబ్బంది ధైర్యంగా అటవీప్రాంతాన్ని సంరక్షించుకోలేకపోవడంతో ఈ ఆయుధాలు ప్రభుత్వం సమకూర్చి ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్టవేసేందుకు కంకణం కట్టుకుంది. వీరికి సహకారం అందిస్తున్న వనసంరక్షణ సమితుల సభ్యులు కూడా అటవీసంపదను రక్షించడంలో స్మగ్లర్ల దాడికి తట్టుకోలేకపోతున్నారు. రాతల్లో మాత్రం అటవీ సంరక్షణ సమితులు పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కనుచూపుమేర చూసినా వన సంరక్షణ సమితి సభ్యుల పనితీరు ఎక్కడా కనిపించలేదు. చాలామంది ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరికేస్తూ వక్రమ మార్గంలో రవాణా చేసిన స్మగ్లర్లంతా కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. ముఖ్యంగా వందల సంఖ్యలో వృక్షాలను నరికే తమిళరాష్ట్రానికి చెందిన కూలీలు జైల్లో మగ్గుతున్నారు.