నవ తెలంగాణ నిర్మాణం విషయంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగ, ఉపాధి, రైతులకు లబ్ధి, సాగునీరు వంటి వాగ్దానాలను అమలు చేయడంలో, నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. మంగళవారం నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. తెరాస సర్కార్ వైఫల్యాలపై ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన ఎన్నికలు ఇవని అయన అన్నారు. బహిరంగ సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చూసిన కలలు సాకారం కావడం లేదని, వాటిని నెరవేర్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన భూమి ఇది అన్నారు. మార్పు కోసం, ప్రగతి కోసం, అమరుల ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణ, మంజీరా వంటి పుణ్యనదులు ప్రవహించే భూమి తెలంగాణ అని అన్నారు. తెలంగాణకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. అమరవీరుల కల సాకారం చేసే తెలంగాణకు వందనమని మోడీ అన్నారు. సరస్వతీ దేవి ఆశిస్సులు పొందుతున్న మీరంతా అదృష్టవంతులన్నారు. నవ సమాజ నిర్మాణం, నవ భారత నిర్మాణం, నవ తెలంగాణ నిర్మాణం కోరుకుంటున్నారని మోడీ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారం విషయంలో అడుగు వెనక్కు వేసేది లేదన్నారు. అమరుల ఆకాంక్షలను పక్కన పెట్టేసిన వారు మరోసారి అధికారంలోకి రాకూడదన్నారు. తెలంగాణలో తెరస సర్కార్ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో తెలంగాణకు తెరాస సర్కార్ ఏంచేసిందో లెక్కలు తేల్చాల్సిన ఎన్నికలు ఇవి అని అయన అన్నారు. ఇక్కడి యువత, రైతులు, దళితలు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల అభ్యున్నతికి ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చారు? ఏం అభివృద్ధి సాధించారా? వాగ్ధానాల వైఫల్యంలో ప్రభుత్వం వైఫల్యంపై సమాధానం ఇవ్వాల్సిందేనని అయన అన్నారు. కాంగ్రెస్ వారి అడుగుజాడల్లోనే ఇక్కడి సీఎం కేసీఆర్ నడుస్తున్నారని మోడీ విమర్శించారు. ఇక్కడి పాలకులకన్నా, ప్రజలకు బీజేపీపైనే విశ్వాసం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని మోడీ అన్నారు. అందుకే హోమాలు, పూజలు, మంత్రాలు, మిరపకాయలు అంటూ కాలం గడుపుతున్నారని మోడీ విమర్శించారు. ఇంత అభద్రతా భావంతో ఉన్న వ్యక్తి ప్రజలకు ఏం చేయగలుగుతారని ప్రశ్నించారు.