YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాంధ్ర వైసీపీలో సామాజిక రగడ

ఉత్తరాంధ్ర వైసీపీలో సామాజిక రగడ
రాజకీయాలకూ కులానికి మధ్యన చక్కటి అవినాభావ సంబంధం ఉంది. సీటు కావాలన్నా, పదవి పొందాలన్నా కులం కంటే దగ్గర దారి వేరేదీ లేదు. ఇపుడు అదే సూత్రాన్ని బలంగా నమ్ముకున్నారు ఆ నాయకుడు. వైసీపీలో సీనియర్ నేతగా, విశాఖ అర్బన్ జిల్లా దక్షిణ నియోజకవర్గం నేతగా ఉన్న కోలా గురువులు ఇపుడు కుల సంఘాల మీటింగులో కనిపిస్తున్నారు. తమ కులానికి అన్యాయం జరిగిందని ఎలుగెత్తి చాటుతున్నారు. రాజకీయంగా అణగదొక్కుతున్నారని కూడా ఆవేదన చెందుతున్నారు. ఇదంతా ఆయన బాధ ప్రపంచ బాధగా మారుస్తున్నార‌ని అంటున్నారు.దక్షిణ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోలా గురువులును ఈ మధ్య కాలం వరకూ అక్కడ ఇంచార్జ్ గా జగన్ ఉంచారు. బాధ్యతలు సైతం కట్టబెట్టారు. విశాఖ పాదయాత్రలో ఆయన చేసిన మార్పులు చేర్పులలో భాగంగా గురువులుకు ఆ ఇంచార్జ్ పదవి పోయి ఓ డాక్టర్ గారికి దక్కింది. రేపటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనేనని కూడా వైసీపీ వర్గాలు అనధికారికంగా డిక్లేర్ చేసేసాయి. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన కోలా గురువులు పార్టీకి ముఖం చాటెస్తున్నారు. తనకు అన్యాయం చేశారని సన్నిహితులతో చెప్పుకుని వాపోతున్నారు.ఇదిలా ఉండగా ఉన్నట్లుండి కోలా గురువులు ఉత్తరాంధ్ర మత్స్త్యకారుల మీటింగు పెట్టారు. ఈ మీటింగులో ఆయన రాజకీయ‌ అధికారం గురించి మాట్లాడారు. తమ జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం ఉండడం లేదని కూడా ఆవేదన చెందారు. రాజకీయ పార్టీలు తమ కులానికి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం మీద చూసుకుంటే గురువులు ఆవేశం అంతా తన సొంత బాధగానే ఉందని అంటున్నారు.విశాఖ నగరంలో పట్టు ఉన్న నేతగా, మంచి మనిషిగా గురువులుకు పేరుంది. అందువల్ల ఆయన గొంతెత్తి రచ్చ చేస్తే పార్టీకి ఇబ్బందికరమైన పరిణామమే. ఉత్తరాంధ్రలో అయితే మత్స్యకారులకు ఇప్పటికి వైసీపీ నుంచి సీట్లు ఇవ్వలేదు. మరి జగన్ వైపు నుంచి ఏదైన హామీ కోసం ఈ విధంగా పట్టుపడుతున్నారా అన్నది చూడాల్సి ఉంది. మరి ఈ మీటింగు తో ఆగుతారా, లేక మరేదైనా సీరియస్ నిర్ణయం తీసుకుంటారా, హైకమాండ్ దీనిపైన ఆలొచన చేయాలని కోరుకుంటున్నారా. ఇవన్నీ ప్రశ్నలు. చూడాలి ఏం జరుగుతుందో

Related Posts