మహా కూటమి అభ్యర్ధిగా నందమూరి ఇంటి ఆడపడుచు మన అన్న ఎన్.టి.ఆర్ గారి మనవరాలు, హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని మీ ముందుకు వచ్చింది. ప్రజా సేవ కోసం వస్తున్న నందమూరి సుహాసిని ని తెలంగాణ ఆడపడుచులు ఆశీర్వదించాలని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం నాడు ఆమె కూకట్ పల్లిలో సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నందమూరి సుహాసిని ని అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. కుకట్ పల్లి అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కాంగ్రెస్, తెలుగుదేశం, టి.జె.ఎ.సి (తెలంగాణ జనసమితి), సి.పి.ఐ పార్టీలు మహా కూటమిగా పోటీ చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మహా కూటమి గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మహా కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మహా కూటమి విజయం సాధించబోతుంది. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఎవరినైనా హక్కున చేర్చుకునే మనస్తత్వం ఉన్నవారు. నందమూరి సుహాసిని మీ సోదరి - ఆమెను ఆదరించండని కోరారు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ద్వారా మరోసారి సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఓట్లు రాబట్టుకోవాలని టి.ఆర్.ఎస్ నాయకులు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అది గ్రహించాలి. గత నాలుగేళ్లలో కూకట్ పల్లి లో ఏమి అభివృద్ధి జరిగిందో తెలంగాణ ప్రజలు గ్రహించాలి. హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడుదని ఆమె అన్నారు. ఈ రోజు మన బిడ్డలు ఇంజనీర్లు గా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందుచూపు. హైదరాబాద్ లో హైటెక్ సి.టి నిర్మాణం చేసి పెద్ద పెద్ద ఐ.టి కంపెనీలు తీసుకువచ్చి ఐ.టి హబ్ గా మార్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, ప్లై ఓవర్లు నిర్మాణం కూడ మన నాయకుడి ఘనతే. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప, గత నాలుగేళ్లలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. హైదరాబాద్ కు ప్రపంచ స్ధాయి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కష్టం, కృషి వల్లే.ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వారి పార్టీ నేతలు, కార్యకర్తలతో అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో గుణపాఠం చెప్తారు. తెలుగువాళ్లు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ బ్రతికే ఉంటుంది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లోంచి తెలుగుదేశం పార్టీ జెండాను తీసివేయడం ఎవరివల్ల కాదని ఆమె అన్నారు.