పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చరిత్ర లో రికార్డు స్థాయిలో11,299 అడుగుల కాంక్రీట్ ను నవయుగ కంపెనీ ఒకరోజు లో పూర్తి చేసింది. ఇంత వేగంగా పనులు జరుగుతున్నా పునాదులు కూడా వేయలేదని మాట్లాడటం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. మంగళవారం అయన మీడియాతో మట్లాడారు. లక్షల మంది ప్రజలు తరలి వెళ్లి పోలవరం ప్రాజెక్టు ను సందర్శిస్తున్నారు. ప్రతి ఇంజనీర్ కు పోలవరం నిర్మాణం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. చంద్రబాబు ముందుచూపు, రాజకీయ అనుభవం వల్లే నేడు రాష్ట్రంలో రైతులు పంటలతో కళకళలాడుతున్నాయని అయన అన్నారు. గోదావరి జిల్లాల్లో ఎకరం కూడా ఎండకుండా అన్ని పంటలు పండాయి. పట్టిసీమ జలాలు రాయలసీమ కు 266టిఎంసిలు వచ్చినా జగన్ కు కనిపించడం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టిఎలు, డిఎలు కావాలి.. అసెంబ్లీ లో మాత్రం అడుగు పెట్టరని విమర్శించారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి పిచ్చి మినహా ప్రజల బాధలు పట్టవు. దేశంలోనే ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడా ఉండదు, రాజకీయం చేయడమే వారి పని. కళ్లు ఉండీ అభివృద్ధి ని చూడలేని దుస్థితిలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ని అడ్డుకునేందుకు పక్క రాష్ట్రాల వారిని రెచ్చగొడుతున్నారు. పులివేందులకు నీరు తేవడం నీకు, నీ తండ్రి కి చేత కాకపోతే, చంద్రబాబు చేసి చూపించారు. హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లా కు నీరు తీసుకొస్తున్నాం. చంద్రబాబు అపర భగీరధుడు తరహాలో రాయలసీమలో అన్ని జిల్లాలకు నీరు ఇవ్వాలని పని చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని ఏడ్చినా, తిట్టినా, అడ్డం పెట్టినా.. వాటిని అధిగమించి 68వేల కోట్ల వ్యయం చేసి నీరు ఇచ్చాం. దేశంలోనే జలవనరులశాఖ లో మన ఎపి రికార్డు సృష్టించింది. చంద్రబాబు కు పేరొస్తుందనే ఉక్రోషమే తప్ప.. రైతుల కష్టాలు జగన్ పట్టించుకోవడం లేదని అన్నారు. నాలుగేళ్లలో 260టిఎంసిలు ఎక్కడైనా ఇచ్చారేమో జగన్ కు దమ్ముంటే చూపించాలి. పోలవరం పై అపోహలు వద్దు..అన్ని వివరాలను ఆన్ లైన్ లో పెట్టాం. పోలవరం ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల కల.. ఇంతకాలానికి చంద్రబాబు సాకారం చేసి చూపిస్తున్నారని అన్నారు. జగన్ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకుండా.. డ్రామాలు ఆడుతున్నారు. చివరకు కోడి కత్తి డ్రామా కూడా ఆడి ప్రభుత్వం పై బురద చల్లాలని కుట్రలు చేశారు. పోలవరం పనులు వేగవంతం చేసి ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తున్నాం. కేంద్రం న్యాయం గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా పనులు చేస్తున్నాం. 3,600కోట్లుఇవ్వాల్సి ఉందని లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదు. అన్ని అడ్డంకులను ఎదుర్కొని పోలవరం నిర్మాణం చేపడుతున్నాం. నోరు తెరచి ప్రశ్నిస్తే ఐటి దాడులతో మోడి రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.