పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం తెలుగుదేశం బీజేపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణ జరిగింది. జగన్నాధపురం గ్రామంలో అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న 30 లారీలను ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అడ్డుకున్నారు. ఇసుక అక్రమల రవాణ పై అధికారులకు సమాచారమిచ్చినా స్పందించకపోవడంపై రోడ్డుపైఅయన బైఠాయించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన, వైసీపీ, బీజేపీ నేతలు కార్యకర్తలు అందోళనకు దిగారు. మరోవైపు, ఎమ్మెల్యే ఆందోళనకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దాంతోపాటు జగన్నాధపురం గ్రామంలో ఉన్న అన్ని మార్గాలను తెలుగుదేశం కార్యకర్తలుమూసివేసారు. ఇరువర్గాల ఆందోళనలతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందగానే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని, వారి వాహనాలను అధికారులు తక్షణమే సీజ్ చెయ్యాలని మణిక్యాలరావు డిమాండ్ చేసారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం నేతలు రోడ్లు దిగ్భందం చేయడం సిగ్గుచేటని అన్నారు. రోడ్లు దిగ్భందం చేసిన వారిని వదిలి నా వద్దకు వచ్చి జులుం చూపితే ఖబడ్దార్ అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మీకు చేతకాక పోతే చెప్పండి ఇప్పటిదాకా శాంతియుతంగా ఉండే మణిక్యాలరావును చూసారు మీరు పది నిముషాలు వెళ్లిపోంది నేనేంటో చూపిస్తానని అయన అన్నారు.