చెంచాగిరి చేసే వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశ్నించారు. ఇలాంటివారి చేతిలో మళ్లీ అధికారం పెడితే రాష్ట్రం అంధకారమే అవుతుందని మోదీ అభిప్రాయంవ్యక్తం చేశారు. కేసీఆర్ మొదట చంద్రబాబు దగ్గర ఇంటర్న్‌షిప్ చేశారని, తర్వాత సోనియా గాంధీ దగ్గర అప్రెంటీస్ చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సోనియా రిమోట్‌కంట్రోల్ ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారని, జనం మీద బుల్లెట్లు కురిపించిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టొద్దని, కాంగ్రెస్‌కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవొద్దని, బలిదానాలు తీసుకున్న కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాకూడదని మోదీ పిలుపు ఇచ్చారు. పాలమూరు కాస్త వలసల ప్రాంతంగా మారిందని, పాలమూరు వెనుకబాటుతనంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ను నిలదీయాల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ప్రాంతం ఎడారిగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. ఒకే కుటుంబం కోసం ఈ తెలంగాణ రాలేదన్నారు. దేశాన్ని నాలుగు దశాబ్దాలు ఒక కుటుంబం కబ్జా చేసిందని, తెలంగాణను నాలుగేళ్లుగా ఓ కుటుంబం కబ్జాచేసి కూర్చుందని సోనియా, కేసీఆర్‌లను ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు.కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోరు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కుస్తీ పోటీలాంటిదని మోదీ అభివర్ణించారు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధిని మరచి కుల రాజకీయాలు ముందుకు తెచ్చారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ మతఘర్షణలు తెస్తే... ఇప్పుడు టీఆర్‌ఎస్ అదే పనిచేస్తోందన్నారు. రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్ ముస్లిం రిజర్వేషన్లు అంటోందని మోదీ విమర్శించారు. అంతకుముందు ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని పాలమూరు ప్రజలందరికీ శుభాబివందనాలు చెప్పారు. పవిత్ర కృష్ణానది ప్రవహిస్తున్న ప్రాంతమిదని, జోగులాంబ శక్తి పీఠం ఉన్న పుణ్యభూమిదని, పాలమూరును అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రధాని స్పష్టం చేశారు. పాలమూరు అంటే పాలు, నీళ్లు అని అర్థమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.