రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు కేంద్రంతో పొత్తు పెట్టుకొని, ఎన్డీయేలో చేరామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. న్యాయం, ధర్మం కోసం కేంద్రంపై తాము పోరాటం కొనసాగిస్తామని, అంతిమ విజయం తమదే అవుతుందని చెప్పారు. మంగళవారం ఆయన విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించిన తెదేపా ధర్మపోరాట సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వాజ్‌పేయీ హయాంలో మంత్రి పదవులు ఇస్తామంటే వద్దని దేశాన్నిబాగు చేయాలని చెప్పిన ఏకైక పార్టీ తెదేపా. చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం చేశారు. అందుకే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం. దానిపై చర్చ సందర్భంగా నా కంటే కేసీఆర్‌కు మెచ్యూరిటీ ఉందని, నేను వైకాపా ట్రాప్‌లో పడ్డానని మోదీ అన్నారు. మోదీకి ఎన్ని నాలుకలు ఉన్నాయో ఇప్పుడే వీడియోలో చూశాం. అమరావతిలో, తిరుపతిలో.. రకరకాల మాటలు చెప్పారు. ప్రధానిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో, బెదిరింపులతో రాజకీయం చేస్తే న్యాయమా? తెలుగు ప్రజలు ఉపేక్షిస్తారా? ఏపీ ఎంపీలను మోదీ బెదిరించారు. ఐటీ, ఈడీ, సీబీఐ ద్వారా ఎన్ని విధాల వీలైత అన్నివిధాలుగా దాడులు ప్రారంభించారు. ఈ దాడులకు భయపడతామా? భయపడాలా? మోదీ దేశాన్ని భ్రష్టుపట్టించారు.‘‘ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. పోలవరం పూర్తి చేస్తామని, రెవెన్యూ లోటు కింద రూ.16వేల కోట్లు ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. బుందేల్‌ఖండ్ మాదిరిగా ప్యాకేజీ ఇస్తామన్నారు. భాజపా నేతలు కడప వెళ్లి రాయలసీమ డిక్లరేషన్ అంటారు గానీ స్టీల్‌ప్లాంట్ మాత్రం ఇవ్వరు. ఇదెక్కడి న్యాయం? తెదేపా జెండా ఎన్డీయే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే మేమే ఏర్పాటు చేసి కడప జిల్లాను ఆదుకుంటాం. కడప జిల్లాకు చెందిన నాయకుడు జగన్ కోడికత్తి డ్రామా ఆడుతున్నారు. కడప జిల్లాలో ప్రజలు ఉక్కు పరిశ్రమ కోరుతుంటే ఆయన కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడితే జైలుకు పోతానని ఆయనకు భయం. నరేంద్ర మోదీని చూస్తే జగన్‌కు వెన్నెముకలో వణుకు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నా. ఎవరు మాట్లాడకపోయినా డిసెంబర్ నెలలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తాం’’ అని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంచేశారు.