ధైర్యం, త్యాగం చేయగలిగిన వాళ్లే రాజకీయాల్లో గొప్ప నేతలు కాగలర్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిజాయితీ ఉన్న యువత ముందుకు వస్తేనే.. రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందన్నారు. నాయకులంటే నిస్వార్థంగా ఉండాలని.. తన జీవితంలో ప్రతి నియోజకవర్గానికి 100 నేతల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు పవన్. జనసేనపోరాట యాత్రలో భాగంగా.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. అమలాపురంలో కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. నాయకత్వం అంటే పదిమందిని ప్రభావితం చేయగలగాలని అన్నారు పవన్. మనం విలువలతో కూడిన ఆలోచనల్ని పదిమందిలోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులంటే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. ఎన్నో ఎదురు దెబ్బలు, ధైర్యం, త్యాగం, ఓర్పుకు సిద్ధం కావాలన్నారు. ఇవన్నీ చేయాలంటే ముందు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే ప్రభావశీలులైన నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలన్నది తన కోరికంటున్నారు జనసేనాని. తనవల్ల ప్రభావితం అయినవాళ్లు ఎవరైనా ఉంటే.. వారు ముందుకొస్తే.. వారిని నేతలుగా తయార చేస్తానన్నారు. తన తుది శ్వాస విడిచేలోపే ప్రతి నియోజకవర్గానికి 100మంది బలమైన నేతల్ని తయారు చేయడమే లక్ష్యమన్నారు పవన్. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలను పుస్తకాలకు పరిమితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. కొన్ని విద్యా సంస్థలు.. విద్యార్థుల్ని గదుల్లో బంధించి చదువు చదువు అంటూ హింస్తున్నాయని.. బట్టి చదువులకు ఇకనైనా స్వస్తి చెప్పాలన్నారు. విద్యార్థి దశలో క్రీడలతో పాటూ మిగిలిన యాక్టివిటీస్ కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. బలమైన శరీరం లేనప్పుడు.. బలమైన ఆలోచనలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 24 గంటలు గదుల్లో కుక్కి పుస్తకాల పురుగులను చెయ్యడంతో వారి మెదడు మొద్దుబారిపోతోందన్నారు.ఈ సందర్భంలో పవన్ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో తాను చదువుకునేటప్పుడు ఎకనామిక్స్ పేపర్ రాయడానికి విక్రమ్ గైడ్ స్లిప్ లు పట్టుకెళ్లాను... మనసు అంగీకరించక కాపీ కొట్టలేదని గుర్తుచేసుకున్నారు పవన్. యువత తమ పక్కన లేదని భావిస్తున్న పార్టీలు ఓట్ల తొలగింపునకు ప్రయత్నించవచ్చు.. చదువుకున్న యువత ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఈ మధ్య కొంతమంది ఓట్లను అక్రమంగా తొలగించారని.. యువత వారానికి ఒకసారైనా ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. ఓటు తీయొచ్చేమో కాని.. ప్రాణాలు తీయలేరుగా అన్నారు పవన్