జిల్లాలో ప్రధాన మంత్రి అవాస యోజన-ఎన్టీఆర్ నగర్ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం చోటు చేసుకుంది. ఇందుకు అనేక కారణాలు చూపిస్తున్నారు. తొలి విడతలో విజయనగరం పురపాలక సంఘానికి చెందిన సారిపల్లి వద్ద ఇళ్ల నిర్మాణాలు ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తికావల్సి ఉంది. ఆ మేరకు నిర్మాణాలు జరగలేదు. వీటిని ప్రారంభించిన 15 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉండగా, ఆ స్థాయి వేగం తగ్గింది. నిర్మాణ సంస్థకు అధికారులు నోటీసులులో ఇస్తున్నారు. ఇక్కడ 2880 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. ఇంత వరకు 50 శాతం ఇళ్లు శ్లాబ్ దశకు వచ్చాయి. దీంతో మార్చి వరకు అనుమతి కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విజయ్ నిర్మాణ్ సంస్థ ప్రభుత్వానికి ఈఓటీ కోసం దరఖాస్తు చేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రావల్సి ఉంది.
రెండో విడతలో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల, విజయనగరం పురపాలక సంఘానికి చెందిన సోనియా నగర్ నిర్మాణాలు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇవి మార్చి నాటికి పూర్తి కావల్సి ఉండగా అవి కూడా జూన్‌నాటికి అయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ స్థల, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాల్లో జాప్యం జరగడంతో ఆలస్యంగా నిర్మాణ పనులు మొదలైనట్టు చెబుతున్నారు. ఈనెల 28న విజయనగరం పురపాలక సంఘానికి చెందిన సారిపల్లిలో 960 ఇళ్ల సామూహిక గృహప్రవేశాలకు ఏ మేరకు సన్నద్ధంగా ఉంది ఏపీ టిడ్కో ఉన్నతాధికారుల నుంచి ఇక్కడి అధికారులకు సమాచారం వచ్చింది..ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని పంపించారు.ఇందులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సంబంధించి విద్యుత్తు, తాగునీరు, మురుగు వ్యవస్థ, రహదారుల సదుపాయం తదితర అంశాలపై పరిస్థితిని తెలియజేయాలని ఇచ్చారు. దాన్ని పూర్తి చేసి అధికారులు నివేదించారు. సారిపల్లి ఇళ్ల నిర్మాణంలో ప్రణాళిక లోపించడం వల్ల జాప్యం జరిగిందని తెలుస్తోంది. మరోవైపు కొండ ప్రాంతం కావడంతో భూమి పనులు ఆలస్యం జరిగినట్టు పేర్కొంటున్నారు.కాగా ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రగతిని వివరించడంలో అధికారుల అలసత్వంపైన విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఇక్కడికి పూర్తిస్థాయి ఈఈ నియామకం చేశారు.
సారిపల్లిలో జీ+3 విధానంలో 90 బ్లాకుల్లో 2880 ఇళ్లను 36 ఎకరాల్లో నిర్మించాల్సి ఉంది. అయితే అక్కడ 88 బ్లాకుల నిర్మాణానికే అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండింటికి స్థలం సరిపోదని గుర్తించారు.ఈ రెండింటిని సోనియా నగర్‌లో నిర్మించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లలో 47 బ్లాకులకు సంబంధించి స్లాబ్ దశ పూర్తి చేసుకున్నాయి. మరో 20 బ్లాకులకు చెందిన తుది దశపనులు జరుగుతున్నాయి. సోనియా నగర్( శ్రీ కోడిరామ్మూర్తి నగర్)లో 9.2 ఎకరాల స్థలంలో 40 బ్లాకుల కింద 1280 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలోని గొల్లపల్లి వద్ద 31.68 ఎకరాల్లో 2481 ఇళ్ల నిర్మాణాలు పునాదులు స్థాయిలో ఉన్నాయి. పార్వతీపురం పురపాలక సంఘంలో స్థల సేకరణ అడ్డాపు శీల వద్ద జరిగింది. ఇక్కడ 17 ఎకరాల స్థలంలో 1504 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ఇక్కడ స్థల సేకరణ ఆలస్యం జరిగింది. సాలూరు పురపాలక సంఘంలో చంద్రపు వలస గుమడ లేఅవుట్‌లో 13.90 ఎకరాల స్థలంలో 36 బ్లాకుల కింద 1440 ఇళ్ల నిర్మాణాలు పునాదుల స్థాయిలో ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయితీకి చెందిన ఇళ్లు నెల్లిమర్ల పంపు హౌస్ వద్ద 25 ఎకరాల స్థలంలో జరుగుతున్నాయి. ఇక్కడ ఇళ్ల కేటాయింపు కంటే లబ్ధిదారుల డిమాండ్ తక్కువగా ఉంది. మొత్తం 2251 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే లబ్ధిదారులు 672 మంది ఉన్నారు. వారి కోసం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడి కేటాయింపును వేరే పురపాలక సంఘానికి బదిలీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.