రాజధాని ప్రాంతంగా ఉన్నా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపడటం లేదు.సౌకర్యాలు పెరగకున్నా ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది. రెండు గదుల ఇల్లు ఆరు వేల వరకూ చెబుతున్నారు. రేకుల ఇల్లు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ పలుకుతున్నాయి. మరోవైపు అపార్టుమెంట్లు ఇబ్బడి ముబ్బడిగా నిర్మితమైనా ఇంకా వీటిలో నివాసం ఉండేందుకు కొనుగోలుదార్లు ముందుకు రావడం లేదు. రాజధాని ఏర్పడిన తరువాత ప్రజలకు మౌలిక సదుపాయాలు పెరగకపోయినా వాహనాల రద్దీతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక సిబ్బందిని నియమించలేదు. ట్రాఫిక్ సిబ్బందిని, పోలీసు స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమైంది. ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలతో పాటు ఇసుక, గ్రావెల్ లారీలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. భారీ వాహనాల రద్దీ వల్ల నియోజకవర్గంలో అలజడి, ఆందోళన పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి రియల్టర్లు, నిర్మాణ దారులు మంగళగిరిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఏ సమయంలో ఏ తరహా వివాదాస్పద ఘటనలు తెరపైకి వస్తాయోనని స్థానికులకు ఆందోళన కలిగించే అంశంగా ఉంది. సిఎం చంద్రబాబు కుటుంబమూ ఈ నియోజకవర్గ పరిధిలోని ఉండవల్లిలో నివసిస్తోంది. అయినా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు మౌలిక సదుపాయాలు లేవు. ఈ నియోజకవర్గం పరిధిలో మంగళగిరి పట్టణం, రూరల్ మండలం, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలున్నాయి. నియోజకవర్గంలో ఒక వైపు 16వ నెంబరు జాతీయ రహదారి ఉండగా పేరెన్నిక గన్న ప్రకాశం బ్యారేజీ నుంచి రాష్ట్ర రహదారి మరో వైపు ఉంది. ఈ రెండు మార్గాలు రాజధాని ప్రాంతానికి అనుసంధానం కలిగి ఉన్నాయి. ఇరువైపులా భారీ స్థాయిలో నిర్మాణా లొస్తున్నాయి. కనకదుర్గమ్మ వారధి నుంచి కాజ వరకూ భారీగా అపార్టుమెంట్లు నిర్మితమవుతున్నాయి. ఈ మార్గంలో టిడిపి, జనసేన పార్టీ కార్యాలయాల నిర్మాణం ఇప్పటికే చురుగ్గా సాగుతోంది. ప్రయివేటు రంగంలో ఐటి కంపెనీలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పలు కార్యాలయాలు వెలుస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం మీద భారీ నిర్మాణాలు చేపడుతున్నా పలు నిర్మాణ కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు. ఒరిస్సా, బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, బీహార్ నుంచి వలస కార్మికులను ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నారు. వీరికి కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా, కనీస వేతనాలి వ్వకుండా నిర్బంధ పనివిధానం అమలు చేస్తున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు వాటిల్లినా కార్మిక కుటుంబాలకు సరైన పరిహారం చెల్లించకుండా దిక్కులేని మృతదేహాలుగా పారేసేందుకు నిర్మాణ సంస్థలు ప్రయత్నించగా సిఐటియు, సిపిఎం కార్యకర్తలు అడ్డుకుని కార్మిక చట్టం ప్రకారం వారికి తగిన పరిహారం ఇప్పించారు.
రాజధాని ఏర్పడినా మంగళగిరిలో తాగునీటి సమస్య తీవ్రంగానే ఉంది. భూగర్భ డ్రెయినేజీ పథకం నిర్మాణానికి నోచలేదు. గత ప్రభుత్వ హయాంలో రూ.32 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించినా కనీసం ప్రస్తుత ప్రభుత్వం సైడ్ డ్రెయిన్స్ కూడా నిర్మించలేకపోయిందనే విమర్శలున్నాయి. సైడ్ డ్రెయిన్లు సరిగా లేక మురుగు నీటిపారుదల అస్తవ్యస్తంగా మారి మంగళగిరి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 30 గ్రామాల్లో వర్షం పడితే మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. మంగళగిరి పట్టణంలో ఇప్పటికీ ఇరుకురోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజ ధానికి వెళ్లే ఒకటి రెండు రహ దార్లను పాక్షి కంగా విస్తరి ంచారే గాని ప్రధాన రహ దారు లను సైతం విస్త రించలేదు. కృష్ణా నది చెంతనే ఉన్నా తాగునీటి సమస్య వెంటాడుతోంది. మంగళ గిరిలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సిఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు నిత్యం ఈ పట్టణం ద్వారా ప్రయాణిస్తున్నా స్థానిక సమ స్యలపై దృష్టి సారించిన పాపాన పో లేదు. సిఎం చంద్రబాబు ఉండ వల్లిలో ఉంటుండగా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అనేక మంది రెయిన్ ట్రీ పార్కులో నివాసం ఉంటున్నారు. ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు. ఈ కంపెనీల్లోనూ గరిష్టంగా రూ.15 వేలకు మించి జీతం ఇవ్వడం లేదని స్థానికేతరులైన ఇంజినీరింగ్ విద్యార్థులు వాపోతున్నారు.