YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మండలాలకు చేరుతున్న చంద్రన్న కానుకలు

మండలాలకు చేరుతున్న చంద్రన్న కానుకలు
రాష్ట్ర ప్రభుత్వం ఏటా పంపిణీ చేస్తున్న ‘చంద్రన్న కానుక’ల సరకులు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలొస్తున్నందున వీటిని సకాలంలో కార్డుదారులకు చేర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు, ఇతర పౌరసరఫరాల గిడ్డంగులకు సరకులు వస్తున్నాయి. జిల్లాలో 9.80 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. టీడీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న కానుకలను ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఆరు రకాల సరకులతో పాటు, కార్డుదారుడు వాటిని ఇంటికి తీసుకువెళ్లేందుకు వీలుగా సీఎం ఫొటోతో ముద్రించిన సంచిని ఉచితంగా ఇస్తారు. డిసెంబరు 25న క్రిస్మస్‌ కావడంతో ముందస్తుగా క్రైస్తవ సోదరులకు వచ్చే నెల 20వ తేదీకల్లా సరకులు పంపిణీ చేయునున్నారు. మిగిలిన కార్డుదారులకు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జనవరి రెండో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లాకు సరకుల సరఫరాలో నెలకొన్న జాప్యం కారణంగా గత ఏడాది పండగ తర్వాత కూడా కార్డుదారులకు నిత్యావసరాలు అందని సందర్భాలు ఉన్నాయి. ఈసారి నెల రోజుల ముందు నుంచే సరఫరా చేసినందున నిర్ణీత గడువులోపు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 19 ఎం.ఎల్‌.ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. ఆయా గోదాంలకు ఇప్పటికే 50 శాతం మేర సరకులు చేరాయి. నెయ్యి ప్యాకెట్లు వంద శాతం వచ్చాయి. డిసెంబరు సాధారణ కోటా రేషన్‌ దుకాణాలకు సంబంధించి ఈ నెల 30వ తేదీతో సరఫరా పూర్తి కానుంది. ఆ తర్వాత చంద్రన్న కానుకలను పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి వాటి పరిధిలోని చౌకధరల దుకాణాలకు తరలించనున్నారు.
ఉచితంగా ఇచ్చేవివే... 
కందిపప్పు - 1/2 కిలో 
పామోలిన్‌-500 మి.లీ 
శనగపప్పు-1/2 కిలో 
బెల్లం- 1/2 కిలో 
గోధుమపిండి- కిలో 
నెయ్యి - 100 మి.లీ

Related Posts