అతి పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ పైనే నేతలందరూ ప్రధానంగా దృష్టి పెట్టారు. నాలుగోసారి విజయం సాధించేందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా దూరంగా ఉన్న అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చెమటోడుస్తుంది. మధ్యప్రదేశ్ లో ఎన్నికలకు ముందు నిర్వహించిన వివిధ సర్వేలు కూడా ఎవరిది అధికారమనేది ఇద్దమిద్దంగా తేల్చి చెప్పలేకపోయాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా, మరికొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలగా రావడంతో ఈ ఎన్నికల్లో ఎవరిది గెలుపనేది ఉత్కంఠగా మారింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో 165 స్థానాలను గెలుచుకుని కమలం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈసారి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదన్నది విశ్లేషకుల అంచనా. వరుసగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేకున్నా భారతీయ జనతా పార్టీ పైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ప్రజల్లో అసంతృప్తి అడుగడుగునా కన్పిస్తూనే ఉంది. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, పెట్రోలు ధరల పెంపు వంటి అంశాలు కమలం పార్టీని ఇరకాటంలోకి నెట్టనున్నాయన్నది విశ్లేషకుల అంచనా.అలాగని కాంగ్రెస్ కూడా ఇక్కడ మరీ అంత బలంగా లేదు. కాంగ్రెస్ లో గ్రూపుల గోల వెంటాడుతూనే ఉంది. కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు ఎవరికి వారే గ్రూపులను ప్రోత్సహించడం, కమలనాధ్ ఇటీవల ముస్లిం ఓటర్లను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులను తెచ్చాయని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టులేకపోవడం కూడా కొంత ఆ పార్టీ శ్రేణులకు నిరాశపర్చే అంశమని చెప్పకతప్పదు. పోలింగ్ లో ప్రధానంగా రైతులు ఎటువైపు చూస్తున్నారన్నది ప్రశ్న. రైతాంగం బీజేపీపై వ్యతిరేకతతో ఉందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. అది తమకు లాభిస్తుందన్న అంచనాల్లో ఉంది. అయితే రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నది కమలం పార్టీ భావన. ఈసారి గ్రామీణ ప్రాంతాలను కూడా తాము కైవసం చేసుకుంటామని కమలనాధులు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మధ్యప్రదేశ్ లో హోరా హోరీ పోరు జరగనుంది. మరి చివరకు ఎవరు విజేతలనేది ఎన్నికల్లో ఓటరు నిర్ణయించాల్సి ఉంది