బుట్టా రేణుక. కర్నూలు రాజకీయాల్లో అందరికీ సుపరిచితురాలైన నాయకురాలు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఈమె .. ఏడాది న్నర కిందట చంద్రబాబు చెంతకు చేరి సైకిల్‌కు జై కొట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆమె వ్యవహార శైలి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. మరో ఆరు మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది. ప్రధానంగా కర్నూలు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్న మాజీ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు టీజీ.భరత్‌కు ఈ టికెట్ ఇప్పించుకునేందుకు నానా ప్రయాసలు పడుతున్నాడు. అంతేకాదు.. తనకు అనుకూలంగా ఉండే నాయకులను కూడా టీజీ దగ్గరకు చేర్చుకుంటున్నారు.అదే సమయంలో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వ్యతిరేకులను కూడా టీజీ తన ఇంటికి పిలిచి.. తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో టీజీకి వరంగా మారింది బుట్టా రేణుక. కర్నూలు ఎంపీగా ఉన్న ఆమెకు, ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట టీజీ.. ఆమెను తన ఇంటికి ఆహ్వానించి.. పార్టీ విషయాలు రాజకీయాలు చర్చించడం సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో తన కుమారుడు టీజీ భరత్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడని సహకరించాలని కోరారట. దీనిపై ఒక్క నిముషం ఆలోచించిన బుట్టా.. వెంటనే ఓకే చెప్పేయడం ఇప్పుడు ఎస్వీ వర్గంలో చెమటలు పట్టిస్తోంది.ఇటీవల టీజీ తనయుడు భరత్.. విజన్ యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. దీనికి బుట్టా సంఘీభావం ప్రకటించారు. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ పాదయాత్రలోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనేటీజీ భరత్‌తో కలిసి బుట్టా ఎస్వీపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. నగర ప్రజలు అవినీతి లేని అభివృద్ధి కోరుకుంటున్నారని, గతంలో తాము అదే చేశామని అంటున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఎంపీ బుట్టా రేణుక కూడా స్వరం కలిపారు. తద్వారా సీటు విషయంలో తన సపోర్ట్ భరత్‌కేనని తేల్చిచెప్పారు. ఈ పరిణామం ఇప్పుడు ఎస్వీ కూటమిలో సెగలు రేపుతోంది. పైగా.. ఎస్వీపై బుట్టా రేణుకకు మరో గుస్సా కూడా ఉండడం గమనార్హం.కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో బుట్టా రేణుకకు అసలు ఎంపీ సీటే రాదని ఎమ్మెల్యే వర్గం ప్రచారం ప్రారంభించింది. పొత్తులో భాగంగా కర్నూలు ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారన్న టాక్ ఉంది. దీనిని ఎస్వీ వర్గం మరింతగా ప్రచారం చేస్తోంది. దీంతో ఎస్వీపై మరింతగా తన స్వరం పెంచాలని బుట్టా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.