తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు సమర్థంగా పనిచేయాలని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని క్యాడర్‌కు స్పష్టంచేశారు. ప్రజా కూటమి గెలుపు దేశ రాజకీయాలకే మేలుమలుపు కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ.లక్ష మాత్రమే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రూపాయి ఇవ్వలేదని.. ఏపీలో ప్రతి డ్వాక్రా మహిళకూ రూ.10వేలు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి లభిస్తే.. తెలంగాణలో అందులో సగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వ భరోసాతో ఏపీలో రైతు ఆత్మహత్యలు ఆగితే.. తెలంగాణలో 5 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ధనిక రాష్ట్రం తెలంగాణ నాలుగున్నరేళ్లలో అప్పుల పాలైందని, లోటు బడ్జెట్‌లో కూడా ఏపీ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు.విజయనగరం ‘ధర్మపోరాటం’ విజయవంతమైనందుకు జిల్లా నేతలను అభినందించారు. మిగిలిన 3 ధర్మపోరాట సభలను కూడా విజయవంతం చేయాలని ఆదేశించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని, బాధ్యత తీసుకోకుండా పదవుల్లో రాణించలేరని హితభోద చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలి.. పార్టీలో చురుగ్గా ఉండాలి’ అనేది తెలుగుదేశం తారకమంత్రమని చెప్పారు. ప్రతి చోటా ప్రజల్లో ఉత్సాహం ఉందని.. పార్టీ నాయకుల్లో అలసత్వం సహించబోనని చంద్రబాబు తేల్చిచెప్పారు. తిరుగులేని శక్తిగా తెలుగుదేశం రూపొందాలని.. డిసెంబర్ 30న రాజమహేంద్రవరంలో ‘బీసీ జయహో’ భారీ సభను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనారిటీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకోవాలన్నారు. సుజనా చౌదరిపై దాడులు రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్టగా దుయ్యబట్టారు. రాజకీయ వేధింపులతో నరేంద్ర మోదీ బరితెగించారని మండిపడ్డారు. భాజపా నేతల వేధింపులను సమర్ధంగా ఎదుర్కొందామన్నారు.