కాలువల ద్వారా సాగు నీటి సరఫరా సక్రమంగా సాగాలంటే క్షేత్రస్థాయిలో వర్కు ఇన్‌స్పెక్టర్లు, లస్కర్లదే కీలక పాత్ర. ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరందించడంలో క్రియశీలకంగా వ్యవహరిస్తారు. అంతటి ముఖ్య భూమిక పోషించే వారి కొరతతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటి సరఫరా నిర్వహణ ఇబ్బందిగా మారింది. వారబంది అమలవుతున్న ప్రస్తుత తరుణంలో వాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్న వారిలో ఎక్కువ మంది ఉద్యోగ విరమణ చేయడం, చాలా ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం, మూడింట రెండొంతుల పోస్టులు ఖాళీగా ఉండడం ఈ సమస్యకు కారణాలు కాగా వీటిని అధిగమించేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండలి సూచన మేరకు ఒప్పంద పద్ధతిలో దినసరి వేతనంపై నియామకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కమాండ్ ఏరియా డెవలప్‌మెంటు ఏజెన్సీ(కడా) కమిషనరు అనుమతిస్తే ఈ సీజన్లోనే సదరు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నెస్పీ లింగంగుంట్ల వలయ పరిధిలో 490 మంది లస్కర్లు, 90 మంది వర్కు ఇన్‌స్పెక్టర్లను వర్కు ఛార్జుడు ఉద్యోగులుగా నియమించారు. సాగర్ నుంచి విడుదలైన నీటిని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు కాలువలపై నిర్దేశించిన ప్రాంతాల్లో తిరుగుతూ కట్టలపై కంప చెట్లు తొలగించడం, ప్రవాహానికి అడ్డుకట్టలు వేయకుండా చూడడం వీరి ప్రధాన బాధ్యతలు. సాగర్ కుడి కాలువ పరిధిలో స్థిరీకరణ ఆయకట్టు 6.59 లక్షలకుగాను 1500 ఎకరాలకు ఒకరు వంతున మొదట్లో పూర్తి సిబ్బంది ఉన్నప్పటికీ క్రమేణా వారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం అందులో సగం మంది మాత్రమే ఉన్నారు. వారిలోనూ కొందరు అనారోగ్యంతో తిరగ లేకపోతున్నారు. కొన్ని కాలువలపై ఒక్కరూ లేకుండానే పోయారు. దీంతో నీటి నిర్వహణ అధికారులకు తలనొప్పిగా మారింది. తాజాగా వారబంది అమలు చేస్తున్నందున ఎక్కడికక్కడే ఎగువ రైతులు అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లిస్తుండడంతో ఇదేమని అడిగేవారు లేక దిగువకు నీరందడం లేదు.సెక్షను ఇంజినీర్ ఉన్నా కాలువ అంతా ఒక్కరే తిరిగి పర్యవేక్షించడం సాధ్యం కాదు. దీంతో దిగువన ఏం జరుగుతుందో? ఎక్కడికి నీరు వచ్చిందో సమాచారం చెప్పే సిబ్బంది లేనందున సరఫరా సజావుగా జరిగే పరిస్థితి కానరావడం లేదు. కంప చెట్లు తొలగించక కట్టలు, కాలువలు అడవిని తలపిస్తున్నాయి. కుడి ప్రధాన కాలువతోపాటు మేజర్లు, మైనర్లన్నింట్లోనూ ఇదే పరిస్థితి.
లింగంగుంట్ల డివిజన్లో 117కు 61 మంది లస్కర్లు ఉన్నారు. ఇక్కడ వర్కు ఇన్‌స్పెక్టర్ల పోస్టులు రెండు ఖాళీ ఉన్నాయి. మాచర్లలో 137కు 40 మంది లస్కర్లు మాత్రమే పని చేస్తున్నారు. ఇక్కడ అయిదుగురు వర్కు ఇన్‌స్పెక్టర్ల కొరత ఉంది. సత్తెనపల్లిలో 76 మంది లస్కర్లు, ఒక్క వర్కు ఇన్‌స్పెక్టరు, ఎంటీ డివిజన్లో రెండింటికీ కలిపి 22 మంది అవసరంకాగా వినుకొండ సిఫ్ట్ డివిజన్లో 25 మంది లస్కర్లు లేరని గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో సిబ్బంది కొరతపై చర్చ నడిచింది. చివరకు నెలకు రూ.10,500 వంతున చెల్లించేలా ఒప్పంద సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. తీరువా వసూళ్లలో నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీలకు పాలన ఖర్చుల కింద కేటాయించిన సొమ్మును ఇప్పటి వరకు వెచ్చించనందున వాటిని ఇందుకు వాడాలని పేర్కొన్నారు. ఈ విధానంలో ఇప్పటికే ఓఅండ్‌ఎం మాచర్ల డివిజన్లో 24,. మానిటరింగ్ డివిజన్లో 10 మందిని నియమించేందుకు పంపిన ప్రతిపాదనలకు కడా కమిషనరు అనుమతించారు. వచ్చే మార్చి నెలాఖరు వరకు వీరు కొనసాగుతారని అధికారులు తెలిపారు. మిగిలిన డివిజన్లలో అవసరమైన చోట్ల నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే రెవెన్యూ శాఖ నుంచి ఫ్లో బ్యాక్ అమౌంటు ఎంత ఉన్నదీ లెక్క తేలాల్సివుంది. ఆ వివరాలు అందిన తర్వాత ఉన్న నిల్వ సొమ్మును బట్టి నియామకాలు చేపడతామని అధికారులు అంటున్నారు.