ఒక రాష్ట్రం కోసం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినప్పుడు.. మనకు జన్మనిచ్చిన మహిళల రిజర్వేషన్ల కోసం ఎందుకు పోరాటం జరగడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విలువలు, బాధ్యత గల ఆడపడుచులు రాజకీయాల్లోకి రాకపోతే సమాజం అవినీతిమయం అయిపోతుందని... చంద్రబాబు, జగన్, లోకేశ్ లాంటి వాళ్లు పెరిగిపోయి సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని సత్యనారాయణ ఫంక్షన్ హాలులో బుధవారం డ్వాక్రా మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మనకు జన్మనిచ్చే ఆడపడుచులకు సరైన గౌరవం ఇవ్వకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బూతులు తిట్టేవారు, ఎదుటివారిపై నోరు పారేసుకునేవారు నేతలే కాదని..సమస్యను అర్థం చేసుకుని మాట్లాడుతూ, విలువలు పాటించేవారే నిజమైన నేతలు అవుతారన్నారు. మగవాళ్ల ఆధిపత్యంలో రాజకీయాలు అవినీతిమయం అయిపోయాయని పవన్ వ్యాఖ్యానించారు. విలువలు, నిజాయతీ కలిగిన ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన తోడ్పాడు అందిస్తుందన్నారు. లక్షలాది మంది అడపడుచుల ఆదరాభిమానాలు దక్కుతాయని తాను కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదని పవన్ అన్నారు. ఒక మహిళ ఇచ్చిన సూచనతోనే ఆడవాళ్లకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ మేనిఫెస్టోలో చేర్చామని.. ఇది ఎంత భారమైనా నిలబెట్టుకుంటామన్నారు. బయటకు వెళ్లిన ప్రతి మహిళ క్షేమంగా ఇంటికి చేరుకునేలా భద్రత కల్పిస్తామన్నారు. అమ్మాయిలు చదువుకు దూరం కాకుండా మండలానికో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీ మహిళలకు అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.