అనంతపురం జిల్లాలో సంవత్సరాల తరబడి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని మురికి కూపాల్లో సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేటికి ఆయా ప్రాంతాలలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం నుంచి వివక్షత ఎదురవుతున్నది. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా కార్మికులకు జీవితాలలో మాత్రం చీకట్లు అలుముకుంటున్నాయి. మూడు దశాబ్ధాలుగా విధులు నిర్వర్తించుతున్న కార్మికుల కుటుంబ పోషణకు కనీసం రూ.5 వేలు అందని పరిస్థితి ఉంది. ఇక విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత పట్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చెత్తకుప్పలు, మురికికాలువలు నిత్యమూ శుభ్రం చేస్తున్న కార్మికుల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో పంచాయతీ, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులు బతుకు జీవుడా అన్నట్లు జీవితాలను నెగ్గుకొస్తున్నారు. జిల్లాలో పంచాయతీ, మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో దాదాపుగా 2500 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, వాటర్‌మెన్స్, బిల్ కలెక్టర్లు, శానిటేషన్ మేస్ట్రీలుగా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన కులాలకు చెందిన వారే వున్నారు. పంచాయతీ ఆదాయంలో 30 శాతం వేతనాలకు నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తున్నట్లు పాలకులు, అధికారులు చెబుతున్నారు. అయితే కార్మికులకు సంక్షేమ పథకాలు దరిచేరటం లేదు. దీంతో ప్రభుత్వం గ్రాండ్స్ రూపంలో వేతనాలను మంజూరు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 151 ప్రకారం వేతనాలు పెంచి చెల్లించాల్సి వున్నా ఆ వైపుగా ఆలోచించటం మానేసింది. కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా, పెన్షన్, గ్రాట్యుటీ అమలు వంటి విషయాలలో ప్రభుత్వం వివక్షతను ప్రదర్శించుతున్నది. గ్రామాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో విశేష సేవలు అందిస్తున్న కార్మికుల జీవితాలను పట్టించుకునే వారు లేరు. కనీస వేతనాల చట్టం 1948 గ్రామ పంచాయతీ కార్మికులకు వర్తింప చేయాలని వున్న క్షేత్ర స్థాయిలో అమలు జరగటం లేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్మికులను ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పనిచేయిస్తున్న పాలకులు, అధికారులు ఒక్క సారి ఆలోచించాలని సఫాయి కార్మికులు కోరుతున్నారు.