శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మార్గశిర మాసోత్సవాల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి 2019 జనవరి 5వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తును, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు, రోడ్ స్టాపర్స్, సైనేజస్ తదితరాలను పెట్టాలని సూచించారు. శానిటేషన్ ముఖ్యమని, మొబైల్ టాయిలెట్లు, నిరంతర తాగునీరు ఏర్పాటు చేయడంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా డస్ట్ బిన్లను జివిఎంసి ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చే అవకాశమున్నందున ప్రత్యేక బస్సులను గురువారాలలో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌టిసి అధికారులను, విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను, వైద్య సౌకర్యాలకు సంబంధించి 108 వాహనంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్, ప్రత్యేక వైద్య క్యాంపులను నిర్వహించాల్సిందిగా వైద్యాధికారులను, ఉత్సవాలు ముగిసే వరకు పరిసర ప్రాంతాలలో వైన్ షాపులను మూసివేయాలని ఎక్సైజ్ శాఖాధికారులను ఆదేశించారు. టికెట్ కౌంటర్లు, అన్నదానం, ప్రసాదం కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీస్ బందోబస్తు, క్యూలైన్లలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని చెప్పారు. దేవాలయ పరిసరాలలో అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచాలన్నారు.