వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పపాదయాత్ర ముగింపునకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన పాదయత్రకు ముగింపు పలకనున్నారు. అదేరోజు ఇచ్ఛాపురం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు పార్టీ నేతలకు జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. జనవరి 5వ తేదీ పాదయాత్ర ముగించిన తర్వాత పది రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత బస్సుయాత్రకు జగన్ శ్రీకారంచుట్టనున్నారు. ఇప్పుడు జగన్ 13వ జిల్లా అయిన శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళంలో నలభై రోజులపాటు పర్యటించాలని ఆయన షెడ్యూల్ తయారు చేసుకున్నారు. సిక్కోలులో ప్రవేశించి ఇప్పటికే జగన్ నాలుగు రోజులు దాటింది.ఇప్పటివరకూ జగన్ 12 జిల్లాల్లో ప్రజాసంకల్ప పాదయాత్రను నిరాటంకంగా పూర్తి చేసుకున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రారంభమైన ప్రజాసంకల్ప పాదయాత్రకు అన్ని జిల్లాల్లోనూ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయనుంచి ప్రారంభమైన పాదయాత్ర జనవరి ఐదో తేదీన ఇచ్ఛాపురంతో ముగియనుంది. చివరి జిల్లాకు చేరుకోవడంతో జగన్ కూడా పార్టీ అభ్యర్ధుల ఎంపిక, భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా సాగుతున్న జగన్ పాదయాత్రకు పెద్దయెత్తున తరలి వస్తుండటంతో పార్టీ క్యాడర్ లోనూ జోష్ పెరిగింది.పాదయాత్రలో ఉండగానే జగన్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని తీసుకున్న జగన్ నిర్ణయాన్ని కొన్ని పక్షాలు వ్యతిరేకించినా ఆ పార్టీ నేతలు మాత్రం దానికి స్వాగతించారు. అసెంబ్లీకి వెళ్లినా ప్రయోజనం ఏముందని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ కండువాలు కప్పేసినా వారిపై అనర్హత వేటు వేయలేదని దుయ్యబడుతున్నారు. ఇక ఐదు గురు ఎంపీలచేత ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించారు. పాదయాత్రలో ఉండగానే విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేయడంతో 18 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి పాదయాత్రను ప్రారంభించారు.జగన్ ఇప్పటి వరకూ 309 రోజులుగా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. మొత్తం 3340 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగించారు. మధ్యలో పండగల సమయంలో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడం, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి రావడంతో పాదయాత్ర ఇచ్ఛాపురం చేరుకోవడానికి ఆలస్యమయింది. ఇప్పటి వరకూ 125 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. 115 బహిరంగ సభలను నిర్వహించారు. చివరి దశకు చేరుకునే సరికి మొత్తం 3600 కిలోమీటర్లకు పాదయాత్ర చేరుకోనుంది. మొత్తం మీద భవిష్యత్తులో ఏ రాజకీయ నేత చేయని విధంగా సుదీర్ఘంగా చేసిన జగన్ పాదయాత్ర చరిత్రలో మిగిలిపోతుందని చెప్పకతప్పదు.