ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలు ఎందుకు అకస్మాత్తుగా వాయిదావేసుకున్నారు. రెండు నెలల నుంచి ఆయన పెద్దగా జిల్లాల పర్యటనలు చేపట్టడం లేదు. తిత్లీ తుఫాను సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పర్యటన మినహాయిస్తే ఆయన అడపా దడపా ప్రభుత్వ కార్యక్రమాల కోసం హాజరవుతున్నారే తప్ప పెద్దగా జిల్లాల పర్యటనలను చేపట్టడం లేదు.
చంద్రబాబు హెచ్చరికల నేపథ్యమో? లేని పోని తలనొప్పులు ఎందుకనో ఏమో? రెండు, మూడు నెలల నుంచి లోకేష్ జిల్లాల పర్యటనలకు స్వస్తి చెప్పారు. తొలుత కర్నూలు జిల్లాకు వెళ్లిన లోకేష్ అక్కడ ఎంపీగా బుట్టా రేణుకను, కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రకటించి సంచలనానికి కారణమయ్యారు. లోకేష్ పర్యటనపై అప్పట్లో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై చంద్రబాబు వద్ద పంచాయతీ కూడా పెట్టారు. లోకేష్ జిల్లా పర్యటన తర్వాత అక్కడ టీజీ, ఎస్వీ వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయనే చెప్పాలి.ఇక ధర్మ పోరాట దీక్షలు జిల్లాలో జరిగితే ఆయన హాజరవుతున్నారు తప్ప విడిగా ఎటువంటి పర్యటనలను పెట్టుకోకపోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.మూడు నెలల క్రితం నారా లోకేష్ దూకుడుగా జిల్లాలను పర్యటించారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తన తండ్రి చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతలతో బిజీగా ఉండటంతో పార్టీ లో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు, నేతల మధ్య సయోధ్యను తెచ్చేందుకు ఆయన ప్రధానంగా పర్యటనలు చేపట్టారు. అయితే నేతల మధ్య సయోధ్య కన్నా ఆయన పర్యటనలతో వివాదాలు ఎక్కువయ్యాయి. ఆయన పర్యటించిన తర్వాత ఆ జిల్లాల్లో నేతల మధ్య మరింత గ్యాప్ పెరిగిందని భావించిన చంద్రబాబు లోకేష్ ను అమరావతి హద్దు దాటొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి.ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో పర్యటించిన లోకేష్ చీరాల నియోజకవర్గంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు, ఎమ్మెల్సీ పోతుల సునీతకు పొసగడం లేదు. లోకేష్ పర్యటనలో ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆమంచి వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా లోకేష్ పర్యటనతో నేతల మధ్య సిగపట్లు తప్పలేదు. దీంతో లోకేష్ జిల్లాల పర్యటనలకు స్వస్తి చెప్పారంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పుడు జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు స్వయంగా మంగళ, బుధవారాలు సమీక్షలు చేస్తున్నారు. ఇలాలోకేష్ కు చంద్రబాబు గిరిగీసినట్లు టీడీపీలోనే నేతలు చెవులుకొరుక్కుంటున్నారు.