వచ్చే ఎన్నికల్లో టికెట్లు హుళక్కి అయ్యేవారి జాబితాలో విశాఖ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరంతా పక్క చూపులు చూస్తున్నారని భోగట్టా. ఎన్నికల ముందే సర్దుకుంటే వేరే పార్టీలోనైనా బెర్త్ కంఫర్మ్ చేసుకోవచ్చునని తెలివైన తమ్ముళ్ళు కొంతమంది భావిస్తున్నారని అంటున్నారు. అర్బన్ జిల్లాలో ఇద్దరు, రూరల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోతారని ప్రచారం అయితే గట్టిగా ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయనకు రెండు సార్లు టీడీపీ టికెట్ ఇస్తే 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆయనపైన ఉన్న ఆరోపణలు, వావాదాస్పదుడన్న పేరుతో పాటు, టీడీపీ సర్వేల్లో ఆయనకు వ్యతిరేకంగా అభిప్రాయం రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెడతారని అంటున్నారు. పైగా ఆయన సీటుని పొత్తులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ద్రోణం రాజు శ్రీనివాస్ కి ఇస్తారని అంటున్నారు. దాంతో వాసుపల్లి ఇపుడు వేరే ఆలొచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన వైసీపీలోకి వస్తారని కూడా టాక్ నడుస్తోంది.ఇదే బాటలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆయనకు సైతం ఈసారి హ్యాండ్ ఇస్తారని అంటున్నారు. గాజువాకలో ఆయన పెర్ఫార్మెన్స్ పట్ల వ్యతిరేకత ఉందని, క్యాడర్ కి అందుబాటులో ఉండరన్న పేరు ఉందని చెబుతున్నారు. దీంతో అయన్ని వదులుకోవాలన్న భావనలో టీడీపీ ఉందంటున్నారు. ఇక చోడవరం ఎమ్మెల్యే రాజు విషయంలో కూడా జన వ్యతిరేకత సాకు చూపించి తప్పించాలనుకుంటున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గానికి టికెట్ ఇస్తారని అంటున్నారు.రాజు 2009, 2014 ఎన్నికల్లో వరసగా గెలిచారు, ఈసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఆయన కోరుతున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం మార్చేస్తానని అంటోంది. దాంతో వేరే పార్టీలోకి జంప్ అయినా సరే తన లక్ చూసుకోవాలని రాజు అనుకుంటున్నారు. పల్లా శ్రీనివాస్ కూడా ఆ విధంగానే ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ ముగ్గురే కాకుండా సీటు డౌట్ ఉన్న మరికొందరు కూడా వైసీపీలో చేరతారని అంటున్నారు. మరి చూడాలి వారి తదుపరి అడుగులు ఎలా ఉంటాయో జగన్ ఏ విధంగా వారికి హామీ ఇస్తారో వేచి చూడాల్సిందే.