తమిళనాడులో ఉప ఎన్నికల మాట ఎలా ఉన్నా ఇప్పుడు అందరి దృష్టి లోక్ సభ ఎన్నికలపైనే ఉంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే నేతలు కూటమి కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కువ లోక్ సభ స్థానాలను ఎవరు చేజిక్కించుకుంటే వారికే మళ్లీ రాష్ట్రంలో అధికారంలో చోటు ఉంటుందన్న సూత్రంతో ఒకింత వేగంగానే ముందుకు కదులుతున్నారు. తమిళనాడులో అగ్రనేతలు జయలలిత, కరుణానిధి మరణంతో రాజకీయ శూన్యత ఏర్పడిందనేది కాదనలేని వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీని డీల్ చేస్తున్న వారి సామర్థ్యం, నాయకత్వ పటిమపై ప్రజల్లో ఒకింత సందేహం ఉండటమే దీనికి కారణం. అన్నాడీఎంకేను తీసుకుంటే జయలలిత మరణం తర్వాత అధికారంలో ఉన్నా ఇది లేనట్లే చెప్పుకోవాలి. ఎన్నికల వేళ రెండాకులు ప్రజలు ఆశీర్వదించరని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. జయలలిత మరణం తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఏ ఎన్నికనూ ధీటుగా ఎదుర్కొనలేకపోవడం వారి సామర్థ్యానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. మరోవైపు అన్నాడీఎంకే నుంచి చీలిపోయి శశికళ మేనల్లుడు దినకరన్ సొంత పార్టీ పెట్టారు. శశికళ జైలు నుంచే తన మేనల్లుడి రాజకీయ సహకారం, సూచనలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల సంఖ్యలో సభ్యత్వాలు ఉన్నాయని చెప్పుకుంటున్న పళని, పన్నీర్ లు ఎన్నికల వేళ చతికలపడక తప్పదన్నది విశ్లేషకుల అంచనా.ఇక మరోప్రధాన పార్టీ డీఎంకే. కరుణానిధి మరణం తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. స్టాలిన్ కు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు గతంలో ఫలించలేదు. ఆయన వ్యూహాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఆయన కూటమి ఏర్పాటులోనే ఎక్కువగా బిజీగా గడుపుతున్నారు. ఆయనకూ ఇంటిపోరు లేకపోలేదు. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి, స్టాలిన్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఎన్నికల వేళ ఇవి మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదు. స్టాలిన్ కాంగ్రెస్, ఐయూఎంఎల్, వైగో కు చెందిన ఎండీఎంకే తదితర పక్షాలన్నీ కలసి లోక్ సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడనున్నాయి. ఈ కూటమిని ప్రజలు విశ్వసిస్తారా? లేదా? అన్నది గాల్లో దీపంలాగానే ఉంది.ఇక ఇద్దరు సినీ హీరోల రాజకీయ రంగ ప్రవేశం కూడా ఈసారి తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే నెలలో రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశముంది. ఆయన పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రజనీ మద్దతు ఎవరికుంటే వారికే అత్యధిక స్థానాలన్న విశ్లేషణలూ వినపడుతున్నాయి. మరో హీరో కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై అంటుంది. అయితే కమల్ కూడా జత కట్టేది ఎవరితోనన్న చర్చ జోరుగా సాగుతుంది. మొత్తం మీద తమిళనాడులో ప్రధాన పార్టీలపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. అదే జరిగితే రజనీ ఎవరికి మద్దతిస్తే వారిదే లోక్ సభ ఎన్నికల్లో విజయం అని చెప్పక తప్పదు.