ప్రభుత్వాసుపత్రుల్లో అందుతున్న సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్యం,కుటుంబ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లో 12 ప్రసవాలు జరిపిన తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం రేఖపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పనితీరుకు ఈ ప్రసవాలు నిదర్శనమన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు ఎంతో మెరుగుపడిందన్నారు. 24 గంటలూ వైద్యంతో పాటు నాణ్యమైన సేవలు పీహెచ్సీల ద్వారా అందుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం పెరగడంవల్ల ప్రసవాల సంఖ్య పెరిగినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రేఖపల్లి ఆసుపత్రి సిబ్బందిని మంత్రి శ్రావణ్ కుమార్ అభినందించారు. త్వరలో ఆసుపత్రిని సందర్శిస్తానని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న వైద్యసేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు.