తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆశలు నెరవేరుతాయని ప్రజలు భావించారని కానీ ఆ ఆశలు నెరవేరలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భూపాలపల్లి జిల్లాలో ప్రజాకూటమి నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో గిరిజనుల రక్షణ చట్టం తీసుకొచ్చామని జల్ జంగిల్ జమీన్‌పై గిరిజనులకు హక్కు కల్పించామన్నారు. అయితే గిరిజనుల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కేసీఆర్ అమలుచేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో మోదీ తెలంగాణలో కేసీఆర్.. గిరిజనుల హక్కులు కాలరాశారని రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేస్తామన్నారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ఒప్పుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కార్మికులకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మర్చిపోయారనిడిస్మిస్డ్ కార్మికులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని రాహుల్ భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు విద్యవైద్యం అందిస్తామన్నారు. సింగరేణి కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.రీడిజైన్లుపేర్ల మార్పుతో కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకున్నారని రాహుల్ విమర్శించారు. రూ. 50 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టును రూ. 90వేల కోట్లకు పెంచారనిమిషన్ భగీరథకాకతీయ పథకాలు అవినీతిమయమని అన్నారు. అన్ని చోట్లా కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాహుల్ ఆరోపించారు.ఐదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడ్డప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే కలను కన్నారు. దీనికి మన నీళ్లు మనకే ఉండాలని ఆ రోజు ఆలోచన చేశాం. యూపీఏ ప్రభుత్వంలో మొత్తం దేశంలోనే గిరిజనులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చాం. వారి భూములు, వారి నీరు, అటవీప్రాంతం వారి వద్దే ఉండాలని నిర్ణయించాం. చుట్టూ అడవి ఉన్నా ఆ ప్రయోజనం గిరిజనులకు దక్కడంలేదు. మీ భూములపై హక్కులు ఇవ్వడంలేదు. మేం బిల్లు తెచ్చినప్పుడు మీ అడవులపై లబ్ధి మీకే అందాలని భావిస్తే.. ఇక్కడి ముఖ్యమంత్రి దాన్ని మీకు అందనివ్వకుండా చేస్తున్నారు.దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆ బిల్లు ఫలాలను మీకు అందనివ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బిల్లును అమలు చేస్తాం. గిరిజనుల జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ అమలు చేస్తాం. పోడు భూముల హక్కు పత్రాలను మీకు ఇస్తాం. కేసీఆర్ ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. మేం దాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. మీ రక్తాన్ని తెలంగాణ కోసం వెచ్చించారు. కానీ కేసీఆర్ మిమ్మల్ని కూడా మోసం చేశారు. కేసీఆర్ హామీలు ఎంతవరకు నిజమో మీరే ఆలోచించుకోవాలి. మా మేనిఫేస్టోలో సింగరేణి కాలరీస్, కార్మికుల అంశాలను చేర్చాం. సింగరేణిలో తాత్కాలికంగా పని చేస్తున్న వారిని కూడా రెగ్యూలరైజ్ చేస్తాం. తొలగించిన కార్మికులను మళ్లీ తీసుకుంటాం. మీ పిల్లలకు విద్య, వైద్యం అందేట్లు చూస్తామన్నారు.ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగం కంపెనీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది. హిందూస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ నుంచి కాంట్రాక్టును లాక్కోని అనిల్ అంబానికి ఇచ్చింది. మీ సింగరేణి గనులను కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయదు. ఐదేళ్లుగా మీ ముఖ్యమంత్రి కేసీఆరే. ఆయన ప్రతి ప్రాజెక్టును రీడిజైన్ చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మర్చారు. కేవలం పేరు మార్పిడి కోసం అంచనాలను రూ.40వేల కోట్లు పెంచారు. ఆ ధనంతో వారి కుటుంబానికి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో పనులు చేయలేదు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారు. తెలంగాణ రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడింది. కానీ నేడు తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. ఈ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల వల్ల కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందుతోంది.మా ప్రభుత్వం వచ్చాక.. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం. మీకు సరైన ధర ఇవ్వకుండా భూములు తీసుకొనే వీలు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల మేరకు రుణాలను మాఫీ చేస్తాం. 17 పంటలకు మద్దతు ధర ఇస్తాం. వరి పంటకు రూ.2 వేలు, పత్తి పంటకు రూ.7వేలు, మిర్చికి రూ.10వేలు మద్దతు ధర ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు.