ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న పరిపాలన కార్యాలయాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనిర్మిస్తున్నారు. ఐదు టవర్లతో ప్రభుత్వ పాలన సముదాయాలను నిర్మించనున్నారు. ఈ భవనాల పునాదులు వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అనుసరిస్తున్నారు. ఒక భవనం 50 అంతస్థులు, నాలుగు భవనాలు 40 అంతస్థులతో నిర్మిస్తున్నారు. నల్లరేగడి నేల కావడంతో ఫౌండేషన్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగా నల్లరేగడి నేలలు ఉండడం, భూగర్భజలాలు పైభాగంలో ఉండటంతో పునాదుల్లోకి నీరు వెళ్లకుండా జియో సింథటిక్ సామగ్రిని నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. పునాది నిర్మాణానికి 4మీటర్ల కంటే లోతుగా తవ్వి భూమిపై సింథటిక్ షీట్ వేసి దానిపై కాంక్రీటు వేస్తారు. ఇలా పలులేయర్లుగా ఇనుము, కాంక్రీటుతో 4మీటర్ల మేర రాఫ్ట్ నిర్మిస్తారు. రాఫ్ట్‌కు చుట్టూ సింథటిక్ షీట్ వేసి కాంక్రీటు నిర్మాణంలోకి భూగర్భజలాలు, డ్రైనేజీ, భూమిలోపలి నుంచి వచ్చే రసాయనాలు పునాదిలోకి వెళ్లకుండా అడ్డుకునేలా జియో సింథటిక్ విధానం పాటిస్తున్నారు. రాఫ్ట్‌పై భవన నిర్మాణం చేపట్టి భవనాలు నిర్మిస్తారు.
సింథటిక్ షీట్ నీటిని పునాదుల్లోకి రాకుండా అడ్డుకుటుంది. దీంతో నిర్మాణ సమయంలో ఉన్న నాణ్యత, సామర్థ్యం భవనం జీవితకాలం ఉండేలా కాపాడుతుంది. పునాదులకు ఉపయోగిస్తున్న స్టీలు నాణ్యమైనదే ఉపయోగిస్తున్నారు. బహుళ అంతస్థులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్ కేటాయిస్తారు. ఫిల్లర్ల మధ్య వాహనాలు నిలుపుతారు. రాజధాని పరిపాలనా సముదాయంలో మాత్రం రాఫ్ట్‌పై భవనాల నిర్మాణం చేపడుతున్నారు. బహుళ అంతస్థుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు భవనానికి సమీపంలోనే వాహనాల పార్కింగ్ కు మరో బిల్డింగ్ నిర్మిస్తున్నారు. రాజధానిలో ఐదు టవర్లలో కొన్నింటికి ముందువైపు, కొన్నింటికి భవనం వెనుకవైపు భూగర్భంలో రెండు అంతస్థులు, పైన రెండు అంతస్థుల్లో వాహనాలు పార్క్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల్లో పార్కింగ్‌కు సదుపాయం కల్పిస్తే ఫిల్లర్ల మధ్య ఖాళీ ఉంటుంది. దీంతో భూ ప్రకంపనల వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్‌కు భవనం సమీపంలో ప్రత్యేక నిర్మాణం చేపడుతున్నారు ఇంజినీర్లు. అత్యాధునిక ప్రమాణాలతో రాజధానిలో పరిపాలన సముదాయాల నిర్మాణం జరుగుతుండడంపై రాష్ట్రవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.