మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయానికి ఐదు నుంచి ఆరు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ భారత్‌కు ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా విలువలు’’ అనే అంశంపై బెంగళూరులోని గ్రీన్‌వుడ్ ఇంటర్నేషనల్ హైస్కూల్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగిస్తూ.. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కావాల్సిన సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయన్నారు.భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడంలో విద్యార్థుల పాత్ర ఏమిటని అడిగిన ఓ సందేహానికి ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగగలదు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 2.268 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దీనిపై నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ విషయంలో మనం మరింత పురోగతి సాధించాల్సి ఉంది. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. ఇప్పటికల్లా మన ఆర్థిక వ్యవస్థ ఐదు నుంచి ఆరు ట్రిలియన్ డాలర్లు ఉండాల్సింది.’’ అని వివరించారు.భారత్ వలసవాద రాజ్యంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ, ఇన్నేళ్లలో చేసిన ప్రణాళికలు, సంస్కరణలు భారత్‌ను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాయని తెలిపారు.శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష పరిశోధన రంగాల్లో భారత్ సాధించిన విజయాల గురించి ప్రణబ్ వివరించారు. ఐరాసలోని 184 సభ్య దేశాల్లో మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి ఉపగ్రహం పంపిన తొలి దేశంగా భారత్ ఖ్యాతి సాధించిందని గుర్తుచేశారు. ఓ నాయకుడు విమర్శలను ఎలా ఎదుర్కోవాలన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘విమర్శ అనేది జీవితంలో ఒక భాగం. ఇది ఎల్లప్పుడూ చెడ్డ విషయం కాదు. దీన్ని ఎప్పుడూ ప్రతికూలంగా భావించనక్కర్లేదు.’’ అని సమాధానమిచ్చారు.