నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తమను కరివేపాకులా వాడుకుంటున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్నవాళ్లకే పదవులు వస్తున్నాయి తప్ప మరొకరికి అవకాశం లేదు. అంతేకాదు పార్టీలో కొత్తగా వచ్చి చేరిన వారికి దక్కుతున్న ప్రాధాన్యత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి లభించడం లేదు. ఇదీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతల మనోగతం. తమ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేరుగా అధినేతకే చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తమను పట్టించుకోవడం మానేసిన నేతలు, కొత్త వారి రాకకోసం ఎదురుచూస్తున్నారని, కొత్తగా వచ్చిన వారికి కండువాలు కప్పిన వెంటనే పదవులు పంచడమేంటని వారు ప్రశ్నిస్తున్నారునెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతినింది. వైసీపీ ఇప్పటికీ బలంగానే ఉంది. మంత్రులు ఇద్దరి మధ్య సఖ్యత లేదు. నేతల మధ్య సమన్వయం లేదు. నెల్లూరు సిటీపైనే తెలుగుదేశం పట్టు గత కొంతకాలంగా లేకపోవడం కూడా పార్టీకి నష్టం చేకూర్చిందన్నది ఒక వాదన. నెల్లూరు నగరంలో ఉన్న నియోజకవర్గాలను అనేకమార్లు పొత్తులో భాగంగా వదిలేసుకుంటూ వస్తుండటంతో ఆ పార్టీకి నేతలున్నా క్యాడర్, ఓటు బ్యాంకు లేకుండా పోయింది. కొన్నేళ్ల నుంచి ఇక్కడ టీడీపీకి స్థానమే లేకుండా పోయింది. ఇలా ఉంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పోటీ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు.నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది. అయితే నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా తనకు ఎమ్మెల్యే సీటు కావాలని పట్టుబడుతున్నారు. దీంతో మధ్యే మార్గంగా నారాయణకు నెల్లూరు అర్బన్ సీటు ఇచ్చి, అజీజ్ కు రూరల్ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచన చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు బీదరవిచంద్ర గండికొడుతున్నట్లు తెలుస్తోంది. తాను గతకొంతకాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టానని, తనకే అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానంపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీద సోదరుల ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరగడం, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉండటంతో ఆ ప్రతిపాదనను చంద్రబాబు కూడా కాదనలేని పరిస్థితి.టిక్కెట్ల కేటాయింపు మాట ఎలా ఉన్నా ముందు నేతల మధ్య ఐక్యత అవసరమని చంద్రబాబు గుర్తించారు. వారం రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. టిక్కెట్లు ఎవరికి ఇవ్వారో తనకు తెలుసునని, ముందు మీ మధ్య సయోధ్య ఉండాలని గట్టిగానే క్లాసు పీకినట్లు సమాచారం. ముఖ్యంగా బీద రవిచంద్రను కూడా అందరినేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. బీద రవిచంద్రకు , ఆదాల ప్రభాకర్ రెడ్డికి మధ్య కూడా గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో బీద రవిచంద్రకు టిక్కెట్ రావాలన్నా ఆదాల సహకారం అవసరం. అందుకే ఇకపై ఆదాలతో విభేదించకూడదని బీద రవిచంద్ర సఖ్యతకు ప్రయత్నిస్తున్నారు. ఏదిఏమైనా నెల్లూరు జిల్లాలో ఈసారి నేతల మధ్య విభేదాలతో గతంలో వచ్చిన సీట్లయినా వస్తాయా? లేదా? అన్నది అనుమానమేనన్నది తెలుగు తమ్ముళ్ల సందేహం.