YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బుద్దా వెంకన్న

కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బుద్దా వెంకన్న
మొన్నటివరకు ఆ సెంటిమెంట్ తెలుగుదేశాన్ని వదలలేదు. టీడీపీ ఆవిర్భావం తరవాత బెజవాడలో ఎవరూ పట్టుమని పదేళ్లు నగర పార్టీ అధ్యక్షులుగా పనిచేసింది లేదు. అయిదేళ్లు సారథ్యం వహించి ఎవరు రికార్డు సృష్టిస్తారా? అని అందరూ ఎదురు చూసినవారే! 1983 నుంచి మొన్నటిదాకా ఇదే పరిస్థితి!! అయితే ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ సెంటిమెంట్‌ను అధిగమించారు ఓ నేత. బెజవాడలో బొమ్మ ఆడిందంటే రాష్ట్రం మొత్తం ఆడినట్టేనంటారు. ఇప్పటికీ నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు తమ సినిమా విడుదలైన వెంటనే విజయవాడలో టాక్‌ ఏంటి? అని తెలుసుకుంటారు. బెజవాడలో సినిమాకు మంచి టాక్ వస్తే రాష్ట్రం మొత్తం కలెక్షన్లు బాగుంటాయనేది వారి నమ్మకం. రాజకీయ చైతన్యానికీ మారుపేరైన విజయవాడలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. ఇక 36 ఏళ్లక్రితం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి బెజవాడలో మొన్నటివరకు ఓ సెంటిమెంట్ ఉండేది. నగర పార్టీ అధ్యక్ష స్థానంలో ఇంతవరకూ ఎవరూ పట్టుమని అయిదేళ్లు కూడా కొనసాగింది లేదు. అయిదేళ్లు పూర్తి కాకుండానే సదరు నేతలు కుర్చీ దిగిపోయేవారు. అంతేకాదు- కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న సందర్భం కూడా చాలా అరుదు.అయితే 2014 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. అక్కడినుంచి పోటీచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోయారు. మిగతా రెండు స్థానాలు టీడీపీ గెలుచుకుంది. విజయవాడ ఎంపీగా కేశినేని దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక తాజాగా సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా బుద్దా వెంకన్న అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేశారు. రికార్డు బ్రేక్ చేసిన ఆయనకు పార్టీ నేతలు ఘనంగా సన్మానం చేశారు. టీడీపీ ఆవిర్భావం తరవాత అడుసుమిల్లి జయప్రకాశ్, బసవేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, నాగుల్ మీరా తదితరులు పార్టీ చీఫ్‌లుగా పనిచేశారు. కానీ ఎవరూ అయిదేళ్లయినా కొనసాగలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు నగర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు బుద్దా వెంకన్న. మధ్యలో చంద్రబాబు ఆయనను మండలికి పంపి విప్ హోదా కూడా కల్పించారు. వీరవిధేయుడిగా ఉండటం, ప్రత్యర్థులపై సందర్భానుసారం విరుచుకుపడటం ఆయనకు ప్లస్ పాయింట్లు అయ్యాయి. టీడీపీకి వెంకన్న అధికార ప్రతినిధి కూడా!టీడీపీలో మరింత క్రియాశీలం అవుతున్న తరుణంలోనే నగర పార్టీ అధ్యక్షుడిగా కూడా బుద్దా వెంకన్న అయిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు వేడుక చేసుకున్నారు. ఎంపీ కేశినేని నాని, మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్ సహా దాదాపు అయిదువేల కుటుంబాల వారు ఈ వేడుకలో పాల్గొన్నారు. జక్కంపూడిలోని మామిడితోటలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటివరకు సాధించిన విజయాలు, వెంకన్న కృషి వంటి అంశాలను ఈ కార్యక్రమంలో నేతలు చర్చించుకున్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఆయన నియోజకవర్గానికే వెళ్లి వెంకన్న సవాల్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీ విపక్షంలో ఉండగా దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం వెంకన్న రెండేళ్లు పోరాటంచేశారు. ఆ సమయంలో చంద్రబాబును రాకుండా అడ్డుకునేందుకు అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పకడ్బందీ వ్యూహం పన్నారు. అయితే లగడపాటిని చంద్రబాబు దగ్గరకు రానివ్వకుండా.. తాను తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తిచేసి.. టీడీపీ అధినేతను ఎయిర్‌పోర్టు దాకా తీసుకెళ్లి సాగనంపారు బుద్దా వెంకన్న. అలాంటి కొన్ని సందర్భాలు వెంకన్నను చంద్రబాబుకు బాగా దగ్గరచేశాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా దుర్గగుడి వివాదాన్ని కొలిక్కి తెచ్చారు వెంకన్న. కార్పొరేషన్‌లో మేయర్, కార్పొరేటర్ల గొడవల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేసి మంచి మార్కులు కొట్టేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడలోని అన్ని స్థానాల్ని గెలుచుకోవడం నగర పార్టీ నేతల ముందున్న అసలు సవాల్. అయితే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లతో పాటు కార్పొరేషన్‌నూ కైవసం చేసుకోవడమే కాదు- అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని శ్రేణులు జోష్‌ఫుల్‌గా మాటిచ్చాయి వెంకన్నకు. పార్టీ చీఫ్‌గా అయిదేళ్లు ఉండి రికార్డ్ బ్రేక్ చేసినట్టే.. 2014 నాటికి మించిన ఫలితాలను సాధిస్తామనే ధీమాలో వెంకన్న ఉన్నారట. 

Related Posts