కర్ణాటక కాంగ్రెస్ లో బలమైన నేతగా ముద్రపడి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి డీకే శివకుమార్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. డీకే శివకుమార్ ఎంత బలమైన నేత అనేది ఇటీవల జరిగిన బళ్లారి ఉప ఎన్నికల్లోనే స్పష్టమైంది. ఆయన కరడు గట్టిన కాంగ్రెస్ వాది. ఇందులో ఏమాత్రం సందేహంలేదు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల దగ్గర నుంచి, నిన్న మొన్న కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ జరిగేంతవరకూ డీకే చూపించిన చొరవ, వ్యూహాలను కాంగ్రెస్ అధిష్టానం కూడా మర్చిపోలేదు. అందుకే ఆయన ఇటీవల తెలంగాణాలోనూ అసంతృప్తులను బుజ్జగించే కమిటీలో నియమించారు.అటువంటి డీకే ఇప్పుడు పార్టీ మారనున్నారా? కర్ణాటకపై భారతీయ జనతా పార్టీ ఆశలు చావలేదా? డీకేకు ముఖ్యమంత్రి ఇచ్చే ప్రతిపాదన ఆ పార్టీలో నలుగుతుందా…? ఇదే చర్చ కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం దక్కలేదు. 104 సీట్లు దక్కించుకున్నా ఎనిమిది సీట్ల తేడాతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కర్ణాటకలో బీజేపీ అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు.సోనియా, రాహుల్ గాంధీలు డీకే శివకుమార్ ను ఆప్తుడిగా చూడటం వెనక ఆయన పార్టీ కోసం శ్రమించిన తీరు… వరుసగా ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నా బెదరని శైలే కారణమని చెప్పకతప్పదు. ఇటీవల తెలంగాణలో జరిగిన సభకు వచ్చిన సోనియా డీకేతో ప్రత్యేకంగా మాట్లాడారంటే డీకే పట్ల వారికున్న నమ్మకం చెప్పకనే చెబుతోంది. కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య వంటి బలమైన నేత ఉన్న ప్పటికీ ఆయనకు మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. డీకే విషయంలో ఇటు మాస్ అటు క్లాస్ కలగలిపిన నేతగా అన్ని పార్టీల రాజకీయ నేతలు చూస్తారు. కమలం పార్టీ ఏకంగా డీకే వైపు గురిపెట్టినట్లు తెలిసింది. డీకే తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. తాజాగా డీకే శివకుమార్ నివాసానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఇరవై నిమిషాల పాటు మాట్లాడటం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. డీకేను పార్టీలోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచే కమలం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ శత్రువుల్లా మెలిగిన డీకే, యడ్యూరప్పల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇద్దరూ ఈ సమావేశాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నప్పటికీ కర్ణాటక రాజకీయాల్లో ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం వీడటం లేదు. మరి డీకే ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీని వీడుతారా? లేక కాంగ్రెస్ ను నమ్ముకునే ఉంటారా? అన్నది తేలాల్సి ఉంది. డీకే కు మాత్రం ముఖ్యమంత్రి కావాలన్న బలమైన కోరిక ఉందన్నది వాస్తవం. మరి ఏం జరుగుతుందో చూడాలి.