YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

లోకహితం  కోసం విషం తాగిన వాడు...

లోకహితం  కోసం విషం తాగిన వాడు...

- అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు.

      అతడు బేసి కన్నుల వాడు. గోచిపాత వాడు.అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.చర్మమే ఆయన దుస్తులు...భస్మమే ఆయన ఆభరణాలు.. స్మశానమే ఆయన ఇల్లు... భూతాలు ఆయన మిత్రులు..
      వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు. దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి. ‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’. ‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని చంపేస్తుంది. ఆ తర్వాత అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత? హాలాహలం వరకు ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది? అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు. 

అతడు బేసి కన్నుల వాడు. గోచిపాత వాడు.అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.చర్మమే ఆయన దుస్తులు...భస్మమే ఆయన ఆభరణాలు.. స్మశానమే ఆయన ఇల్లు... భూతాలు ఆయన మిత్రులు.."లోకాల... కోసం నేను విషాన్నిమింగేస్తాను." అన్నాడు. "రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను" అన్నాడు. హాలా హల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి. 
అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య."నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?" ఆప్యాయంగా అనుకుంది పాము. అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు చుట్టుకుంది. 
విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి. కాబట్టి అది గొంతు దిగకుండా భార్య ‘పార్వతి’ వచ్చి ఆయనలో తాను సగమైంది.  గొంతును అదిమి పట్టుకుంది.
"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా". 
అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు. 
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది. 
..
విషం గొంతులో ఉంది. 
శంకరయ్య నీల కంఠుడయ్యాడు..గరళ కంఠుడయ్యాడు..స్థితి కంఠుడయ్యాడు. తల తిరుగుతోంది. మత్తు ఆవహిస్తోంది. విషం తన పని తాను చేసుకుంటోంది. రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు. 
.. "అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు. నీకోసం మేముంటాము" అంటూ, సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని నిద్ర మాని జాగారం చేశాయి.
‘సమాజం’ కోసం పనిచేసేవాడికి ‘సమాజమే’ తోడు. ‘లోకహితం’ కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది. ‘జనం’ కోసం విషం తాగిన వాడు. అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు. ఆ రాత్రి శివరాత్రి అయ్యింది!!!

Related Posts