మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కళ్యాణోత్సవ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన లగడపాటి తెలంగాణ ఎన్నికలపై పలు ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ఈ సారి స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారని లగడపాటి అన్నారు. తెలంగాణలో ఈసారి ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలిపారు. డిసెంబర్ 7 న తన సర్వే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో దాదాపు 9 నుంచి 10 స్థానాలలో స్వతంత్ర అభ్యర్ధుల గెలుపు తధ్యమని అన్నారు. రోజుకు ఇద్దరి పేర్ల చొప్పున స్వతంత్ర అభ్యర్ధుల సర్వే ఫలితాలను విడుదల చేస్తానని లగడపాటి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట్ నుంచి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎస్టీ నియోజకవర్గం నుంచి జాధవ్ అనిల్ కుమార్ ల గెలుపు ఖాయమని రాజగోపాల్ వెల్లడించారు.