భారతీయులు సహితం త్వరలోనే అండర్‌వాటర్ రైలు ప్రయాణాన్నిచేయబోతున్నారు.ఇందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి భారత్ వరకు అండర్‌వాటర్ హైస్పీడ్ రైలును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూఏఈలోని ఫుజురాయ్ నగరం నుంచి ముంబయి వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేస్తున్నట్లు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహి వెల్లడించారు. ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఖలీజ్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.‘భారత్‌లోని ముంబయి నుంచి ఫుజురాయ్ నగరాన్ని కలుపుతూ నీటి అడుగున హైస్పీడ్ రైలును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది. భారత్ నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడనుంది’ అని అబ్దుల్లా చెప్పినట్లు ఖలీజ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. దాదాపు 2000 కిలోమీటర్ల మేర ఈ రైలు నెట్‌వర్క్ ఉండనుంది. ప్రయాణికులతో పాటు ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభతరం అయ్యే విధంగా ఈ రైలు ప్రాజెక్టును రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ వంటి దేశాలు కూడా ఇటువంటి రైల్వే వ్యవస్థను తీసుకురావాలనే యోచన చేస్తున్నాయి.